ప్ర‌పంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ అధిప‌త్యానికి తెర‌ప‌డింది. 9 నెల‌ల‌కు పైగా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉన్న ఆయ‌న రెండో స్థానానికి ప‌డిపోయారు. మ‌స్క్ ను వెన‌క్కు నెట్టి.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి అవ‌త‌రించారు. బ్లూమ్ బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ రిపోర్ట్ ద్వారా ఈ విష‌యం వెల్ల‌డైంది.

ఇటీవ‌ల టెస్లా షేర్లు భారీగా ప‌త‌న‌మైన సంగ‌తి తెలిసిందే క‌దా. సోమ‌వారం ఒక్క‌రోజే 7.16 శాతం ప‌డిపోయాయి. దీంతో మ‌స్క్ సంప‌ద పెద్దెత్తున ఆవిరై 197.7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు త‌గ్గింది. ఇదే స‌మ‌యంలో 200.3 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ఉన్న బెజోస్.. ప్ర‌పంచలోనే సంప‌న్నుల లిస్ట్ లో టాప్ ప్లేస్ ఆక్ర‌మించారు. కాగా, గ‌త 9 నెల‌ల్లో మ‌స్క్ రెండో స్థానానికి ప‌డిపోవ‌డం ఇదే తొలిసారి.

గ‌ణ‌నీయంగా పుంజుకున్న అమెజాన్ షేర్లు:

Poultary

జెఫ్ బెజోస్ 2021లో చివ‌రిసారిగా వ‌ర‌ల్డ్ బిలియ‌నీర్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ కు చేరుకున్నారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆ స్థానం ద‌క్కింది. భార‌తీయ క‌రెన్సీలో ప్ర‌స్తుతం ఆయ‌న సంద‌ప విలువ 16.58 ల‌క్ష‌ల కోట్లు.. కాగా మ‌స్క్ సంప‌ద 16.41 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఒక టైంలో వీరిద్దరి సంపద మ‌ధ్య‌ వ్యత్యాసం ఏకంగా 142 బిలియన్ డాలర్లు ఉండేది. కానీ కొద్ది రోజులుగా అమెజాన్ షేర్లు గ‌ణ‌నీయంగా పుంజుకున్నాయి. వాటి విలువ రెండేళ్ల‌లో దాదాపు రెట్టింపు అయింది. దీంతో, బెజోస్ తిరిగి అగ్ర‌స్థానాన్ని ఆక్ర‌మించారు.

జెఫ్‌ బెజోస్‌ 2017లో తొలిసారి మైక్రోసాఫ్ట్ కో-ఫౌండ‌ర్ బిల్ గేట్స్‌ను అధిగమించి నంబర్ 1 స్థానంలో నిలిచారు. 2021లో టెస్లా షేర్లు బలపడటంతో మస్క్ సంపద భారీగా పెరిగింది. దీంతో బెజోస్ వెనుక‌బ‌డిపోయారు. మ‌ళ్లీ ఇప్పుడు పుంజుకున్నారు. ఇక‌, ఫ్రాన్స్ కు చెందిన లగ్జరీ వస్తువుల ఉత్పత్తి సంస్థ ఎల్వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 197.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement