దేశంలో అత్యంత ధనికురాలు రోష్ని నాడార్
భారత్ లో అత్యంత సంపన్న మహిళల జాబితాలో హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్నీ నాడార్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 2021లో రూ. 84,330 కోట్ల నికర సంపదతో ఫస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకున్నారు. బ్యూటీ, వెల్ నెస్, ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె నికర సంపద విలువ రూ. 57,200 కోట్లు. కొటాక్ ప్రైవేట్ బ్యాంకింగ్ – హురూన్ సంయుక్తంగా ఈ జాబితాను విడుదల చేశాయి. మన దేశంలో 100 మంది సంపన్న మహిళల పేర్లను లిస్ట్ లో పొందుపర్చాయి. అందులో బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా మూడో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ. 29,030 కోట్లు. కాగా, గత ఏడాదితో పోలిస్తే కిరణ్ మజుందార్ షా సంపద 21 శాతం క్షీణించింది. దీంతో ఆమె ర్యాంక్ పడిపోయింది.
తొలి 100 స్థానాల్లో నిలిచిన ధనిక మహిళల మొత్తం సంపద విలువ రూ. 4.16 లక్షల కోట్లు. ఇది మన దేశ జీడీపీలో 2 శాతంతో సమానమని కొటాక్ ప్రైవేట్ బ్యాంకింగ్ – హురూన్ తెలిపాయి. 2020తో పోలిస్తే వారి ఆస్తుల విలువ 53 శాతం పెరిగిందని వెల్లడించాయి. మన దేశంలో పుట్టిన లేదా పెరిగిన మహిళా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులతో ఈ జాబితాను తయారు చేసినట్టు వివరించాయి. ఇందులో ఢిల్లీ నుంచి 25 మంది, ముంబై నుంచి 21 మంది చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ నుంచి 12 మంది పలు స్థానాలను ఆక్రమించారు. వారిలో అపోలో ఆస్పత్రికి చెందిన నలుగురు ఉండటం విశేషం.
హైదరాబాద్ నుంచి ఉన్న వారి వివరాలు..:
* దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమ మోటపర్తి హైదరాబాద్ నుంచి తొలి స్థానంలో, మొత్తం లిస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ. 28,180 కోట్లు.
* మహిమా దాట్ల – బయోలాజికల్ ఈ ( రూ. 5,530 కోట్లు), సునీతా రెడ్డి – అపోలో హాస్పిటల్స్ ( రూ. 4,760 కోట్లు), సుచరిత రెడ్డి – అపోలో సింధూరి హోటల్స్ ( రూ. 3,700 కోట్లు), శోభన కామినేని – అపోలో హాస్పిటల్స్ ( రూ. 2,740 కోట్లు), సంగీత రెడ్డి – అపోలో హాస్పిటల్స్ ( రూ. 2,690 కోట్లు), ప్రీతా రెడ్డి – అపోలో హాస్పిటల్స్ ( రూ. 2,230 కోట్లు)తో పాటు మరికొందరు ఆ జాబితాలో ఉన్నారు.
భోపాల్ కు చెందిన 33 ఏళ్ల కనికా తెక్రివాల్ ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అతి పిన్నవయస్కురాలు కావడం విశేషం. ఆమె సంపద విలువ రూ. 420 కోట్లుగా ఉంది.
ALSO READ: బస్ ట్రాకింగ్ యాప్ ను ప్రారంభించిన TSRTC