నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం

ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం:

సమస్త ప్రాణకోటి ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అది లేనిదే జీవి మనుగడ సాగించలేదు. నీరు, నేల, గాలి, అడవులు, బొగ్గు, సహజ వాయువులు … ఇలాంటివన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు. పర్యావరణంలో భాగస్వాములు. జీవరాశుల మనుగడకు ఇవన్నీ దోహదపడతాయి. ఎన్నో ప్రాధాన్యతలున్న ప్రకృతిని ఎందుకు పరిరక్షించుకోవాలి..? అలా చేయకపోతే కలిగే అనర్థాలు ఏమిటి..? భవిష్యత్ లో ఏం జరుగుతుంది..? ఇలాంటివన్నీ గుర్తుచేసే రోజే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం. ప్రతీ సంవత్సరం జూలై 28న దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

భూమి సహజ వాతావరణం నుంచి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువులు, చెట్లను పరిరక్షించడం … దానిపై అవగాహన కల్పించడమే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం ముఖ్య ఉద్దేశం. మనం చేసే తప్పిదాల వల్ల ప్రకృతి ప్రమాదంలో పడుతోంది. సహజ వనరులను ఇష్టారాజ్యంగా వాడటం వల్ల జీవజాతుల ఉనికి అగమ్యగోచరంగా తయారైంది. పారిశ్రామికీకరణ తదితర కారణాల వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. అడవుల నరికివేత, రసాయన ఎరువులు, ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి.

హిమనీ నదాలు కరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. మానవ తప్పిదాల వల్ల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. ఓజోన్ పొర క్షీణించిపోతోంది. మరోవైపు, కోవిడ్ వంటి మహమ్మారులు ప్రబలుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

Poultary

ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలన్నా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్నా … ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. అభివృద్ధి పేరుతో జరిగే అనర్ధాలకు స్వస్తి పలకాలి. జనాభా అవసరాలకు తగినట్లుగా సౌర, జల, పవన విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురావాలి. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ వంటి 3 – ఆర్ మంత్రా పాటించాలి. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విరివిగా మొక్కలను నాటాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. నీటి వృథాను అరికట్టాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా ఇందుకోసం కృషి చేయాలి. ఇలాంటివన్నీ పాటించి ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలి. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడితే అంతకు వెయ్యి రెట్లు అది మనకు మేలు చేస్తుంది.

 

ALSO READ: దేశంలోనే సంపన్న మహిళ రోష్నీ నాడార్

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here