స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి రెడీ అవుతోంది. మొబైల్ నెట్ వ‌ర్క్స్ కోసం ఉద్దేశించిన 8 స్పెక్ట్రమ్‌ ల‌ను ఆక్ష‌న్ కు ఉంచ‌నుంది. వీటి బేస్ ప్రైజ్ రూ. 96,317.65 కోట్లుగా నిర్ణ‌యించారు. ఈ ఏడాది మే 20న వేలం ప్రారంభ‌మ‌వుతుంది. అంత‌క‌న్నా ముందు 13, 14వ తేదీల్లో మాక్ ఆక్ష‌న్ నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు వేలానికి సంబంధించిన అప్లికేష‌న్ల‌ను ఆహ్వానిస్తూ కేంద్ర‌ టెలికం శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగా హెర్ట్జ్ తో పాటు 26 గిగా హెర్ట్జ్ బ్యాండ్లు వేలం వేయ‌నున్నారు. ఇందులో పాల్గొనే కంపెనీలు ఏప్రిల్ 22లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 9న బిడ్డ‌ర్ల లిస్ట్ ను అనౌన్స్ చేస్తారు.

ప్ర‌స్తుతం స‌ర్వీస్ అందిస్తున్న‌ టెలికం సంస్థ‌లు ఆ సేవ‌ల్లో అంత‌రాయాన్ని నివారించేందుకు నిర్ణీత ధ‌ర‌ల‌ను చెల్లించి స్పెక్ట్ర‌మ్‌ వినియోగాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు. ఇక‌, వేలంలో స్పెక్ట్ర‌మ్‌ సొంతం చేసుకున్న కంపెనీల‌కు 20 ఏళ్ల కాలానికి దాన్ని కేటాయిస్తారు. దీనికి సంబంధించి 20 స‌మాన వాయిదాల్లో చెల్లింపులు చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తారు. 19 ఏళ్ల త‌ర్వాత స్పెక్ట్ర‌మ్‌ స‌రెండ‌ర్ చేసే చాన్స్ ఉంటుంది. ఈ సారి వేలంలో స్పెక్ట్ర‌మ్‌ యూసేజ్ ఛార్జీలు లేక‌పోవ‌డం విశేషం.

ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మ‌ధ్య పోటీ:

ఈ సారి వేలంలో భార‌తీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కీ రోల్ పోషించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మేజ‌ర్ బిడ్డ‌ర్లుగా అవి నిల‌వ‌నున్నాయి. స్పెక్ట్ర‌మ్ ను అవి త‌ప్ప‌నిస‌రిగా రెన్యూవ‌ల్ చేసుకోవాల్సి ఉండ‌ట‌మే అందుకు కార‌ణం. భార‌తీ ఎయిర్ టెల్ రూ. 4,200 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 1,950 కోట్ల ఎయిర్ వేవ్స్ రెన్యూవ‌ల్ చేసుకోవాల్సి ఉంది. రిల‌య‌న్స్ జియోకు ఇప్ప‌ట్లో ఆ అవ‌స‌రం లేదు.

Poultary

ఈ నేప‌థ్యంలో ఏయే కంపెనీలు ఎంత స్పెక్ట్ర‌మ్‌ సొంతం చేసుకుంటాయి? ఏ టెలికం ఆప‌రేట‌ర్ ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తుంది? ఇవ‌న్నీ తెలియాలంటే మే వ‌ర‌కు ఆగాల్సిందే.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement