కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి రూ. 500కే సిలిండర్..! దీని అమలుపై పౌరసరఫరాల శాఖ కసరత్తు వేగవంతం చేసింది. విధివిధానాలు రూపొందించే పనిలో పడింది. దీనిలో భాగంగా గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి? ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశముంది? వాటికి పరిష్కార మార్గాలేంటి? అనే అంశాలపై ఇందులో చర్చించారు. ఆ తర్వాత అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాటిని ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 8వ తేదీ నుంచి మొదలయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ. 500కే సిలిండర్ సరఫరాపై ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.
ఆ ప్రతిపాదనలు ఇవే:
వినియోగదారులకు ప్రస్తుతం 955 రూపాయలకు ఒక సిలిండర్ అందుబాటులో ఉంది. ఒకవేళ స్కీమ్ అమలైతే వాళ్లు 500 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 455 రూపాయలు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ సబ్సిడీని ఎవరికి ఇవ్వాలన్న దానిపై మూడు ప్రతిపాదనలొచ్చినట్టు తెలిసింది. అందులో ఒకటి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ఆ మొత్తాన్ని చెల్లించడం. రెండోది గ్యాస్ కంపెనీలకు ఇవ్వడం.. ఇక మూడోది వినియోగదారులకే నేరుగా అందజేయడం. వీటిలో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. రాజస్థాన్ లో గ్యాస్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు సబ్సిడీ మొత్తాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదు. మరిక్కడ కూడా అలాగే జరుగుతుందా? లేక వాళ్లు ఒప్పుకుంటారా? అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక, తెలంగాణలో గ్యాస్ వినియోగదారుల వివరాలను కేంద్రం అనుమతి తీసుకున్న తర్వాత అందిస్తామని గ్యాస్ కంపెనీల ప్రతినిధులు.. పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిపినట్టు సమాచారం.
ఎంత మంది లబ్ది పొందుతారంటే?
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందనుంది. తెలంగాణలో ప్రస్తుతం 90 లక్షల వైట్ రేషన్ కార్డులున్నాయి. అలాగే కోటి 24 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఉంది. కాగా, తెల్లకార్డు కలిగిన వారిలో 64 లక్షల కుటుంబాలు మాత్రమే గ్యాస్ కనెక్షన్ పొందినట్టు తెలుస్తోంది. మిగతా 26 లక్షల కార్డులున్న వారికి గ్యాస్ కనెక్షన్ లేదు. దీన్ని బట్టి 64 లక్షల కార్డుదారులు 500 రూపాయలకే సిలిండ్ పొందే అవకాశముంది. దీని వల్ల ప్రభుత్వంపై 1,740 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
- పి. వంశీకృష్ణ