సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
బోనాల పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం. గ్రామ దేవతలను ఘనంగా కొలిచే అపురూప సందర్భం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో.. నెల రోజుల పాటు వేడుకగా జరిగే ఉత్సవం. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, గణగణ గంటల మోతలు, యువత ఆటపాటలు, కోలాటాలతో… బోనాల పర్వదినం ఆద్యంతం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ అద్భుత ఘట్టంతో యావత్ తెలంగాణ పులకించిపోతుంది. ఆధ్మాత్మిక శోభతో అలరారుతుంది.
దశాబ్దాల చరిత్ర ఉన్న బోనాల పండుగ… ప్రకృతితో ముడిపడి ఉంది. తొలకరి జల్లులు కురిసి… ప్రకృతి పరవశించే సమయంలో.. భక్తులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పాడి పంటలు వృద్ధి చెందాలని… తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకుంటారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బోనాలు నిర్వహించినప్పటికీ… హైదరాబాద్ లో జరిగే ఆ ఉత్సవాలు మాత్రం ఎంతో ప్రత్యేకం. రాష్ట్ర రాజధానిలో ఆషాఢ మాసంలో బోనాల జాతర జరుగుతుంది. ఆ సమయంలో యావత్ భాగ్యనగరం బోనమెత్తుతుంది. గల్లీ గల్లీ భక్తి శ్రద్ధలతో పరవశించిపోతుంది. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం చారిత్రక గోల్కొండ ప్రాంతంలో బోనాల పండుగ మొదటగా ప్రారంభం కావడం ఆనవాయితీ. అనంతరం… సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా జాతరను నిర్వహిస్తారు. ఇవన్నీ వేటికవే ప్రసిద్ధి పొందినప్పటికీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు మరింత విశిష్టత ఉంది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరను లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. ఈ మహంకాళి గుడి నిర్మాణం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర దాగుంది. సికింద్రాబాద్ కు చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ ఆర్మీలో పని చేసేవారు. ఆయన్ను 1813లో మధ్యప్రదేశ్ కు బదిలీ చేశారు. తర్వాత కొద్దిరోజులకు హైదరాబాద్, సికింద్రాబాద్ లో కలరా వ్యాధి తీవ్రరూపం దాల్చింది. ఆ మహహ్మారి అనేక మంది ప్రాణాలను బలిగొంది. ఈ వార్త మధ్యప్రదేశ్ లో ఉన్న అప్పయ్య, ఆయన స్నేహితులను ఎంతో కలచివేసింది. ఈ క్రమంలో వాళ్లు అక్కడి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. జంటనగరాల్లో కలరా మహమ్మారి తగ్గిపోతే… సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి గుడిని కట్టిస్తామని అప్పయ్య మొక్కుకున్నారు. ఆ తర్వాత అద్భుతం జరిగింది. అప్పయ్య వేడుకున్నట్టుగానే హైదరాబాద్, సికింద్రాబాద్ లో కలరా కనుమరుగైంది. దీంతో, ఆయన సికింద్రాబాద్ పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అమ్మవారిని ప్రతిష్టించి… ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారు. ఆ తల్లి దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల కోసం గుడి పక్కనే ఉన్న బావిని పునరుద్ధరించారు. ఆ సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ దొరికింది. దాన్ని మహంకాళి విగ్రహం పక్కనే ప్రతిష్టించారు. సురటి అప్పయ్య మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆషాఢ మాసంలో సేవించుకున్నారు. అందువల్ల సికింద్రాబాద్ లో కూడా ప్రతి ఏటా అదే నెలలో బోనాల జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు.
మహంకాళి బోనాల ఉత్సవం.. ఎదుర్కోలు ఘట్టంతో మొదలవుతుంది. ఆ తర్వాత అమ్మవారి ఘటాన్ని సికింద్రాబాద్ పుర వీధుల్లో తిప్పుతారు. జాతర రోజు మాతను దర్శించుకోలేని వాళ్లంతా తమ ఇళ్ల ముందే ఘటాన్ని సేవించుకుంటారు. ఆ తల్లి చల్లని దీవెనలను పొందుతారు. ఇక జాతరలో మరో ముఖ్య ఘట్టం బోనాల సమర్పణ. బోనం అంటే భోజనం అని అర్థం. మహిళలు వేకువజామునే లేచి… తల స్నానమాచరించి.. బెల్లం అన్నాన్ని వండుతారు. దానితో పాటు పాలు, పెరుగు, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన పదార్థాలను… మట్టి లేదా రాగి కుండలలో ఉంచుతారు. ఆ బోనం పెట్టిన పాత్రపై దీపాన్ని వెలిగించి.. దాన్ని తలపై పెట్టుకుని… ఊరేగింపుగా అమ్మవారి గుడికి బయల్దేరుతారు. సాక పోయడం కోసం ఒక చెంబులో శుద్ధమైన జలాన్ని కూడా తీసుకెళతారు. మహంకాళి గుడికి చేరుకుని.. ముందుగా మాతంగేశ్వరి అమ్మవారికి సాకను పోస్తారు. అనంతరం మహంకాళి మాతకు బోనాన్ని సమర్పించి తమను చల్లగా చూడాలని వేడుకుంటారు.
ఇక బోనాల జాతరలో విశిష్ట వ్యక్తులు పోతురాజులు. వీళ్లను అమ్మవారికి సోదరులుగా భావిస్తారు. పోతురాజుల వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. ఒంటి నిండా పసుపు, నుదిటిపై పెద్ద కుంకుమ బొట్టు, కాలికి గజ్జెలు, ఎర్ర రంగు చిన్న ధోవతి ధరిస్తారు. డప్పు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తూ.. సమూహాన్ని ముందుండి నడిపిస్తారు. వేపాకులు నడుముకు చుట్టుకుని, కొరడాతో బాదుకుంటూ.. అమ్మవారి పూనకం వచ్చిన భక్తులను గుడి లోపలికి తీసుకెళ్తారు. పోతురాజులను భక్త జన సమూహానికి రక్షకులుగా భావిస్తారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో మరో ముఖ్య ఘట్టం.. రంగం. అమ్మవారికి ప్రతిరూపమైన మహిళ… పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణిని వినిపించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రంగం చెప్పే స్త్రీని మాతంగి అని పిలుస్తారు. మహంకాళి దేవాలయానికి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరి దేవి సమక్షంలో రంగాన్ని నిర్వహిస్తారు. రాబోయే సంవత్సర కాలంలో జరిగే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, రుతుపవనాల కదలికలు, వర్షాలు, పంటలు ఎలా ఉంటాయనే అంశాలను మాతంగి వివరిస్తుంది. భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. రంగం అనంతరం గావు కార్యక్రమాన్ని పోతురాజులు నిర్వహిస్తారు. రంగం చెప్పిన మహిళను అమ్మవారు ఆవహించి ఉంటుంది కనుక ఆమెను శాంతింపజేసేందుకు గావు పడతారు. ఆ మాతంగి … మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడంతో రంగం ఘట్టం ముగుస్తుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పర్వదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జాతర సమయంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో ఆ గుడిని అందంగా అలంకరిస్తారు. ఈ ఏడాది జూలై 17 నుంచి లష్కర్ బోనాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.