ప్రింటెడ్ సోలార్ టెక్నాలజీ:
ఈ అనంత విశ్వంలో అపారమైనది సౌరశక్తి. దాని వినియోగం మానవాళికి ఎంతో ఉపయోగకరం. సూర్యుడి నుంచి అనునిత్యం వెలువడే ఆ శక్తిని సక్రమంగా వాడుకునేందుకు ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది సోలార్ ప్యానెళ్లు. సౌరశక్తిని కరెంటుగా మార్చేందుకు ఇవి దోహదపడతాయన్న సంగతి తెలిసిందే. సాంప్రదాయ సోలార్ ప్యానెళ్ల వినియోగం ఎన్నో ఏళ్లుగా చలామణిలో ఉంది. అయితే ఇప్పుడొస్తున్న నయా టెక్నాలజీ … దాన్ని రీప్లేస్ చేసే అవకాశముంది. ఆ సాంకేతికత ఏంటో తెల్సుకోవాలంటే ఇది చదవాల్సిందే.
ప్రింటెడ్ సోలార్ టెక్నాలజీ. సౌరశక్తి వినియోగంలో సరికొత్త సంచలనం. సాంప్రదాయ సోలార్ ప్యానెళ్లకు ప్రత్యామ్నాయం. ప్రింటెడ్ సోలార్ టెక్నాలజీ లో ప్యానెళ్లు అతిపల్చగా ఉంటాయి. ప్రింటర్ల నుంచి ముద్రించే వీటి మందం కేవలం 0.075 మిల్లీమీటర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవి ఆల్ట్రా థిన్. ప్రింటెడ్ సోలార్ ప్యానెళ్లను ఇళ్ల పై కప్పుపై న్యూస్ పేపర్లలాగా పరవొచ్చు. వీటి నిర్వహణ కూడా ఎంతో సులభం.
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాసిల్ … ప్రింటబుల్ ఫొటోవోల్టేక్ సోలార్ సెల్స్ ను అభివృద్ధి చేసింది. ప్రొప్రెయిటరీ టెక్నాలజీని వినియోగించి వీటిని తయారు చేశారు. కండక్ట్ ఎలక్ట్రిసిటీ, సోలార్ ఎనర్జీని ఒడిసిపట్టే సామర్థ్యం ఉన్న ఆర్గానిక్ పాలిమర్స్ ను ఈ ప్యానెళ్లలో ఉపయోగిస్తారు. ఇవి ఆర్గానిక్ పాలిమర్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల … ప్రింటర్ల నుంచి ముద్రించుకోవచ్చు. అన్ని సదుపాయాలు ఉన్న కమర్షియల్ ప్లాంట్ లో ఒకే రోజులో కిలో మీటర్ల కొద్దీ ఈ సోలార్ ప్యానెళ్లను ప్రింట్ చేయవచ్చు.
సాంప్రదాయక ఫొటోవోల్టేక్ సోలార్ ప్యానెళ్ల విషయానికి వస్తే ఇవి సిలికాన్ పై ఆధారపడతాయి. వీటి తయారీకి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. అంతే కాకుండా ఒక చదరపు మీటర్ లో 15 కేజీల బరువుతో సాంప్రదాయక ప్యానెళ్లను పరవాల్సి ఉంటుంది. దీన్ని ప్రింటెడ్ సోలార్ ప్యానెళ్లు నివారిస్తాయి. అంతేకాకుండా వీటి తయారీకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కవు. చదరపు మీటర్ కు కేవలం 550 రూపాయలు మాత్రమే అవుతుంది. ప్రింటెడ్ సోలార్ ప్యానెళ్లు అతికించడం కూడా చాలా ఈజీ. ప్రత్యేకమైన టేపును ఉపయోగించి వీటిని రూఫ్ టాప్ పై పరుస్తారు. వీటిని అనేక రకాలుగా వాడొచ్చు. స్ట్రీట్ లైట్లు, వాటర్ పంప్స్, డిజాస్టర్ షెల్స్, వాహనాలు ఇలా రకరకాలుగా వినియోగించవచ్చు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రింటెడ్ సోలార్ టెక్నాలజీ … రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.