ఈ నెల 25న ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవిని చేపట్టనున్న తొలి గిరిజన నేతగా, రెండవ మహిళగా ఘనత దక్కించుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ముర్ము భారీ మెజార్టీతో గెలుపొందారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. దీంతో, ముర్ము 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం పోలింగ్ నమోదయింది. 4,754 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అందులో 53 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో 4,701 ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. వాటి విలువ 10,56,980. ఇందులో ముర్ముకు 64.03 శాతం (6,76,803) ఓట్లు పడ్డాయి. యశ్వంత్ సిన్హా 35.97 శాతం (3,80,177) ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో సిన్హాకు 34 పార్టీలు సపోర్ట్ ఇవ్వగా … ముర్ముకు 44 పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆమె గెలుపు ముందే ఖరారయింది.
ద్రౌపది ముర్ము ప్రస్థానం:
ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలో జన్మించారు. సంతాల్ అనే గిరిజన తెగ ఆమెది. డిగ్రీ వరకు చదివారు. రాజకీయాల్లోకి రాకముందు స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఇరిగేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా కూడా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 1997లో బీజేపీలో చేరారు. రాయ్ రంగపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్ గా గెలుపొందారు. 2000లో రాయ్ రంగపూర్ నగర పంచాయతీకి చైర్ పర్సన్ అయ్యారు. అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ – బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రి పదవి చేపట్టారు.
జార్ఖండ్ గవర్నర్ గా..:
జార్ఖండ్ గవర్నర్ గా కూడా ద్రౌపది ముర్ము పని చేశారు. 2015 మే 18న ఆ బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్ కు తొలి మహిళా గవర్నర్ ఆమే కావడం విశేషం. మన దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా … ఒడిశా నుంచి నియమితులైన తొలి మహిళా గిరిజన నేతగా కూడా ముర్ము పేరుపొందారు. ఇప్పుడు భారత రాష్ట్రపతిగా సేవలను అందించనున్నారు.
ద్రౌపది ముర్ము స్వస్థలంలో సంబరాలు..:
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపొందటంతో ఆమె స్వస్థలం అయిన రాయ్ రంగపూర్ లో సంబరాలు మిన్నంటాయి. గిరిజన మహిళ అత్యున్నత స్థాయికి చేరుకోవడం పట్ల అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. లడ్డూలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించారు.
ప్రధాని మోడీ సహా పలువురి అభినందన:
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టనున్న ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ప్రతిపక్షాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ALSO READ: విజయవాడ మహిళకు మిసెస్ ప్లానెట్ కిరీటం