ప్రపంచ ప్రఖ్యాత హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో కేటీఆర్
ప్రపంచ ప్రఖ్యాత హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో జరిగిన సమావేశంలో మంత్రి కే తారకరామారావు మాట్లాడారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ గా తెలంగాణను పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ప్రభుత్వ విధానాల వలన, పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే సుమారు 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ ఐ పాస్ పారిశ్రామిక విధానం అనుమతుల ప్రక్రియ గురించి ప్రత్యేకంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను, ప్రాధాన్యతను గుర్తించిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం నాలుగవ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నదని, ఈ కేంద్రం ముఖ్యంగా హెల్త్ కేర్ మరియు లైఫ్ సైన్సెస్ రంగం యొక్క పురోగతి కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1000కి పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయని, ఇందులో నోవార్టిస్, మెడ్ట్రానిక్, బేయర్, సనోఫీ, రోషే, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి తదితర అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్ లలో 35% కేవలం తెలంగాణ నుంచే తయారు అవుతున్నాయని, 200కు పైగా FDA అనుమతులున్న తయారీ యూనిట్లు కలిగిన రాష్ట్రం ప్రపంచంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉన్నదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మా రంగంలో కేవలం తయారీ యూనిట్లు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలను కూడా అనేక కంపెనీలు కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఫార్మా లైఫ్ సైన్సెస్ తో పాటు ఐటీ మరియు ఐటి అనుబంధ రంగంలోనూ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని, అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి కంపెనీలు తమ రెండవ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాదులో కలిగి ఉన్న విషయాన్ని సమావేశానికి హాజరైన ప్రముఖులకు కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆధునిక టెక్నాలజీలైన డాటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, మెటావర్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాలను లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉపయుక్తంగా మార్చుకున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న కెమిస్ట్రీ, బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో అద్భుతమైన నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఫార్మ లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.