రెండు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. జనగామ, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు. ఒడిశా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం … దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొంకణ్ వరకు ద్రోణి కొనసాగుతుండటం ఇందుకు కారణమని వివరించారు. దీని ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఉంటుందని తెలిపారు.
గ్రేటర్ కు ఎల్లో అలర్ట్..:
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. రెండు, మూడు రోజుల పాటు కాస్త తెరిపిచ్చిన వర్షాలు మళ్ళీ జోరందుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్ లో పలు చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. బాచుపల్లిలో 12.8, హఫీజ్ పేట్ లో 10.3, కూకట్ పల్లి, బాలానగర్ లో 10.2 సెంటీమీటర్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్ళు నిలిచిపోయాయి. దీంతో, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి శుక్రవారం కుండపోత వాన పడింది. అక్కడ 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 20.58 సెంటీమీటర్ల వాన పడింది. ఇక, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ALSO READ: మరో అద్భుత ఫీచర్‌ను ముందుకు తీసుకొస్తున్న ఫేస్‌బుక్