వయసు 15 ఏళ్లు … జీతం రూ. 33 లక్షలు..!
సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలెన్నో సాధించొచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన వేదాంత్ దేవ్ కాటే విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇన్ స్టాగ్రామ్ ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 33 లక్షల రూపాయల జీతంతో కొలువు దక్కేలా చేసింది.
వేదాంత్ వయసు 15 సంవత్సరాలు. ఇన్ స్టాగ్రామ్ ఎక్కువగా వాడతాడు. కోడింగ్ లో మహా మేధావి. ఒకసారి తన తల్లి ల్యాప్ టాప్ లో లాగ్ ఇన్ అయి ఇన్ స్టా స్క్రోల్ చేస్తుండగా ఓ లింక్ కనిపించింది. వెబ్ సైట్ డెవలప్ చేసే కాంటెస్ట్ యాడ్ అది. ఆ ప్రకటన వేదాంత్ ను ఆకట్టుకుంది. వెంటనే లింక్ ఓపెన్ చేశాడు. వెబ్ సైట్ డెవలప్ మెంట్ పోటీలో పాల్గొన్నాడు. 2000 లైన్ల కంప్యూటర్ కోడ్ ను రెండు రోజుల్లో రాసేశాడు. అదే తన లైఫ్ ను మారుస్తుందని ఆ కుర్రాడు ఊహించలేదు.
కొంత కాలం తర్వాత వేదాంత్ కు న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ఆ కంపెనీ నుంచి సమాచారం అందింది. వెబ్ సైట్ కాంటెస్ట్ లో అతడు గెలుపొందినట్టు తెలిపింది. అంతే కాకుండా భారీ ప్యాకేజీతో వేదాంత్ కు జాబ్ కూడా ఆ కంపెనీ ఆఫర్ చేసింది. జీతం ఏడాదికి 33 లక్షల రూపాయలు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ వేదాంత్ వయసే అసలు సమస్యగా మారింది. జాబ్ లో చేరేందుకు అడ్డంకి అయింది. కంపెనీ రూల్స్ ప్రకారం ఇంత చిన్న వయసులో ఆ ఉద్యోగంలోకి తీసుకోవడం కుదరదు. అందుకే స్కూలింగ్ పూర్తైన తర్వాత తమను సంప్రదించాలని ఆ సంస్థ వేదాంత్ కు సూచించింది.
వేదాంత్ చదువులో చాలా చురుకైన విద్యార్థి. అతడి తల్లిదండ్రులిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. చిన్నప్పటి నుంచే మంచి గైడెన్స్ ఇచ్చారు. దీంతో అతడు చక్కగా రాణిస్తున్నాడు. animeeditor.com అనే వెబ్ సైట్ ను వేదాంత్ క్రియేట్ చేశాడు. బ్లాగ్స్ , వ్లోగ్స్, చాట్ బోట్స్ వంటి సేవలను దీనిద్వారా వినియోగించుకోవచ్చు.
ALSO READ: రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము