యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా మొద‌ల‌య్యాయి. 11 రోజుల పాటు ఇవి కొన‌సాగుతాయి. మొద‌టిరోజు స్వ‌స్తివ‌చ‌నం, అంకురార్ప‌ణ‌, రక్షాబంధనం, విశ్వక్సేనారాధనతో ఉత్స‌వాల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌తీస‌మేతంగా హాజ‌రై స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వారికి అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్ర‌హ్మోత్స‌వాల ప్రారంభ కార్య‌క్ర‌మానికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు కొండా సురేఖ‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఆల‌య ఉద్ఘాట‌న త‌ర్వాత రెండోసారి..:

యాదాద్రీశుడి ప్ర‌ధాన ఆల‌య ఉద్ఘాట‌న త‌ర్వాత రెండోసారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా మార్చి 12న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం ఉంటాయి. 13న మ‌త్స్య అలంకారం, శేష వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. 14న వ‌ట‌ప‌త్ర‌శాయి అలంకారం, హంస వాహ‌న సేవ‌, 15న ముర‌ళీ కృష్ణుడి అలంకారం, పొన్న‌వాహ‌న సేవ, 16న గోవ‌ర్ధ‌న‌గిరిధారి అలంకారం, సింహ వాహ‌న సేవ ఉంటాయి. ఇక‌, 17న ఎదుర్కోలు వేడుక‌, 18న ఉత్త‌ర మాఢ వీధుల్లో ల‌క్ష్మీనార‌సింహ తిరుక‌ల్యాణ మ‌హోత్స‌వం జ‌రుగుతుంది. 19న దివ్య విమాన ర‌థోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. 20న మహా పూర్ణాహుతి, చక్ర తీర్థం, 21న గ‌ర్భాల‌యంలో మూల విరాట్ కు స‌హ‌స్ర ఘ‌టాభిషేకం జ‌రుగుతుంది. అదే రోజున శృంగార డోలోత్స‌వంతో ఉత్స‌వాలు ప‌రిస‌మాప్త‌మ‌వుతాయి.

ప‌లు ఆర్జిత సేవ‌లు నిలిపివేత‌..:

బ్ర‌హ్మెత్స‌వాల నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌లు ఆర్జిత‌ సేవ‌లు నిలిపివేశారు. మొక్కులు, క‌ల్యాణాలు, సుద‌ర్శ‌న నార‌సింహ హ‌వ‌న పూజ‌ల‌కు విరామమిచ్చారు. కొండ‌పై ప‌లు ఆంక్ష‌లు విధించారు. ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నాల‌ను నిలిపివేశారు. అటు, భ‌క్తుల కోసం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆల‌య అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్ర‌హోత్స‌వాల కోసం ఆల‌యాన్ని, ఆ ప‌రిస‌రాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ‌తో అల‌రారుతోంది.

Poultary
- పి. వంశీకృష్ణ‌
Bharati Cement