తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజు సెషన్ లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. మహాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ స్పీచ్ ను ప్రారంభించారు. యువత బలిదానం, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, పోరాటాల ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు చెప్పారు.
అతి త్వరలో 6 గ్యారెంటీలు అమలు:
ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధంగా ఉందని గవర్నర్ తమిళి సై తెలిపారు. వాటిలో రెండింటిని అమలు చేశామన్నారు. మహాలక్ష్మి స్కీం కింద ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా మహిళలు ఫ్రీ బస్ జర్నీ సదుపాయాన్ని ఉపయోగించుకున్నాని చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.
జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన సక్సెస్ అయిందని గవర్నర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి కోటి 28 లక్షలకు పైగా అప్లికేషన్లు అందాయన్నారు. త్వరలోనే మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారికి 500 రూపాయలకే సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. TSPSC ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి విద్యా వ్యవస్థ దాకా అనేక రంగాల అభివృద్ధి తమ భవిష్యత్ ప్రణాళికలో ఉందని వివరించారు. హైదరాబాద్ కు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని.. అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరిస్తామని అన్నారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడంపై దృష్టి:
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గవర్నర్ విమర్శించారు. ప్రజలపై భారం పడకుండా తెలంగాణ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడం ప్రస్తుత సర్కారు ముందున్న సవాలని అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ బడ్జెట్ ఒక చక్కటి అవకాశం. మన రాష్ట్రంలో వ్యవసాయమే అనేక మందికి జీవనోపాధి. అందుకే వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది. ఇందుకుగానూ పంట రుణమాఫీ, రైతు భరోసా, పంట మార్పిడి కార్యక్రమాలు, ఉద్యానవనాల అభివృద్ధి, నాణ్యమైన విత్తనాల సరఫరా వంటివి చేపడుతున్నాం’ అని తమిళిసై చెప్పారు.
గవర్నర్ ప్రసంగంలో మరికొన్ని కీలకాంశాలు:
- ఎంఎస్ఎంఈలకు సహకారాన్ని అందించేందుకు ప్రత్యేక సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు
- ఐటీ, ఫార్మా రంగాలకు మరింత చేయూత .. 10-12 విలేజ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు
- తెలంగాణకు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు .. దావోస్ సదస్సులో జరిగిన ఒప్పందం
- రాష్ట్రంలో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చడంపై దృష్టి
- ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయం
- సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం అమలు
- కృత్రిమ మేధ రాజధానిగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు చర్యలు
- లేటెస్ట్ టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు.. రూ. 2 వేల కోట్ల వ్యయం
- తెలంగాణలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీల ఏర్పాటు
- సమగ్ర ఇంధన పాలసీని తీసుకురానున్న ప్రభుత్వం
- త్వరలోనే కుల గణన చేపట్టనున్న సర్కారు
- 2030 నాటికి కర్బన ఉద్గారాలు తగ్గించడమే లక్ష్యం
గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
- పి. వంశీకృష్ణ