పేమెంట్స్ గేట్ వే పేటీఎం పని ఖతమైందా? ఈ నెల 29 తర్వాత అది పని చేయదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ఒకవేళ పేటీఎం సేవలు నిలిచిపోతే కోట్లాది మంది యూజర్ల సంగతేంటి? అందులో ఉన్న బ్యాలెన్స్ వాడుకోవచ్చా? లేదా? ఈ క్వశ్చన్లంటికీ క్లారిటీ కావాలా అయితే ఇది చదవండి.
యూపీఐ పేమెంట్స్ చేయాలన్నా, మొబైల్, ఫాస్టాగ్ రీఛార్జ్ కావాలన్నా, ఇతర ఆన్ లైన్ లావాదేవీలు జరపాలన్నా ఠక్కున గుర్తొచ్చేది.. పేటీఎం కరో..! మన డైలీ లైఫ్ తో అదంతగా పెనవేసుకుంది..! భారత్ లో 30 కోట్ల మందికిపైగా దీన్ని వాడుతున్నారంటే పేటీఎం ఎంత పాపులరో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు..! అలాంటి పేమెంట్స్ గేట్ వేపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. దీంతో యూజర్లలో కంగారు మొదలైంది.
-
అసలేం జరిగింది?:
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పేటిఎం సమర్పించిన ఆడిట్ కు, బయటి ఆడిటర్లు ఇచ్చిన నివేదికకు చాలా వ్యత్యాసం ఉంది. రూల్స్ ను పేటీఎం తరచూగా బ్రేక్ చేసిందని దీన్నిబట్టి తెలుస్తోంది. దీంతో బ్యాంకుల నియంత్రణ చట్టం ప్రకారం ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. వీటికారణంగా.. ఈ నెల 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో క్రెడిట్ డిపాజిట్, లావాదేవీలు, వ్యాలెట్, ఫాస్టాగ్ టాప్ అప్స్ నిలిచిపోతాయి. అలాగే వినియోగదారుల ఖాతాలు, ప్రీ-పెయిడ్ ఇన్ స్ట్రుమెంట్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్స్, టాప్ అప్స్ చేసుకునే వీలుండదు..! కాగా, యూజర్లు వారి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునేందుకు పేటీఎం పూర్తిగా సహకరించాలని ఆర్బీఐ సూచించింది. సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, ఫాస్టాగ్ లలో నిల్వ ఉన్న అమౌంట్ విత్ డ్రా విషయంలోనూ కస్టమర్లపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశించింది.
-
ఎలాంటి ప్రభావం ఉంటుంది?:
ఆర్బీఐ డిసిషన్ వల్ల ఈ నెల తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఎక్కువ ప్రభావం పడనుంది. ఫిబ్రవరి 29 వరకు ఆ సేవలన్నీ మాములుగానే ఉంటాయి. తర్వాత పేటీఎం వ్యాలెట్, యూపీఐ సర్వీసుల్లో మార్పులొస్తాయి. పేటీఎం వ్యాలెట్ లో డబ్బులను ఇతర అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.. కానీ అందులోకి డిపాజిట్ చేయడం కుదరదు. థర్డ్ పార్టీ బ్యాంక్ తో లింకైన పేటీఎం ఖాతాలు మాత్రం ఎప్పటిలాగే పని చేస్తాయి. యూపీఐ పేమెంట్స్ కూడా కంటిన్యూ అవుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ వంటి గుర్తింపు పొందిన అకౌంట్లు పేటీఎంలో వాడుతున్నట్టయితే ఎలాంటి ప్రభావం ఉండదు. ఒకవేళ వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో లింకైన వ్యాలెట్ ను యూజ్ చేయాలనుకుంటే మాత్రం అది పని చేయదు. ఫాస్టాగ్ లో డబ్బులుంటే వాటిని మార్చి 1 తర్వాత కూడా వాడుకోవచ్చు.. కానీ ఫాస్టాగ్ లో డిపాజిట్ చేసే వీలుండదు.
-
పేటీఎం స్పందన ఏమిటి?:
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పని చేస్తుందన్నారు. ప్రతి సవాల్ కు ఓ పరిష్కారం ఉంటుందని.. నిబంధనలకు లోబడి సేవలను అందిస్తామని చెప్పారు. పేటీఎంకు మద్దతుగా నిలిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అంటే ఈ నెల తర్వాత కొన్ని రకాల పేటీఎం సేవలు మాత్రమే నిలిచిపోతాయి..! మిగతావన్నీ ఎప్పటిలాగే కంటిన్యూ అవుతాయి. అంటే కంగారు పడాల్సిన పని లేదన్నమాట.
- పి. వంశీకృష్ణ