విదేశీ పాప్ సింగర్లు, సినిమా సెలెబ్రిటీలు, క్రికెటర్లు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు ఒకే చోట చేరి సందడి చేశారు. ఆటాపాటలతో హోరెత్తించారు. కళ్లు చెదిరే డెకోరేషన్, మైమరపించే ఆతిథ్యం, ఎటు చూసినా కోలాహలం.. వీటన్నింటీకి గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా నిలిచింది. అక్కడ జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అదరహో అనిపించింది. మూడు రోజుల పాటు ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ ఏడాది జూలైలో అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్ తో ఏడడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించారు. జామ్ నగర్‌లోని రిలయన్స్ టౌన్ షిప్ సమీపంలో ఉన్న జోగ్వాడ్ లో జరిగిన వేడుకలు అన్నసేవతో ప్రారంభమయ్యాయి. ముకేశ్, అనంత్, రాధిక సహా అంబానీ కుటుంబ సభ్యులు గ్రామస్థులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని స్వయంగా వడ్డించడం విశేషం.
రిహన్నాకు రూ. 74 కోట్లు?:
ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు వేడుకలు జరిగాయి. ఇతర దేశాలకు వెళ్లి చేసుకునే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కాకుండా మనదేశంలోనే పెళ్లిళ్లు జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు కదా. దాన్ని అనుసరించి అనంత్-రాధిక పెళ్లి వేడుకలను జామ్ నగర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏరియా మొత్తం కళకళలాడిపోయింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ మొదటి రోజు గ్లోబల్ పాప్ సెన్సెషన్ రిహన్నా పర్ఫామెన్స్ మెస్మరైజ్ చేసింది. ఆమె గంటన్నర పాటు ఆహూతులను అలరించింది. ఇందుకుగానూ రిహన్నాకు అందిన పారితోషకం మన కరెన్సీలో దాదాపు 74 కోట్లని తెలుస్తోంది.
ఎవరెవరు హాజరయ్యారంటే?:
షారూఖ్ ఖాన్ ఫ్యామిలీతో పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్, మార్క్ జుకర్ బర్గ్, బిజెన్ వుమన్ నటాషా, ఇవాంకా ట్రంప్, సైఫ్-కరీనా ఫ్యామిలీ, క్రికెటర్ ధోని ఫ్యామిలీ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రేవో, బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొన్, రణ్ బీర్ కపూర్-అలీయాభట్, జాన్వీ కపూర్, రాణీ ముఖర్జీ, సోనాలి బింద్రే, కరిష్మా కపూర్ తదితరులు తళుక్కున మెరిశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరాని దంపతులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సతీసమేతంగా హాజరయ్యారు.
ఆకట్టుకున్న నీతా అంబానీ నృత్య ప్రదర్శన:
తన కొడుకు పెళ్ళి వేడుకల్లో నీతా అంబానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె క్లాసికల్ డాన్సర్. విశ్వంభరి స్తుతిపై చేసిన డాన్స్ అమితంగా ఆకట్టుకుంది. ఇక, ప్యార్ హువా, ఎకరార్ హువా సాంగ్ పై ముఖేశ్ అంబానీ-నీతా అంబానీలు ఇచ్చిన పర్ ఫామెన్స్ అదరహో అనిపించింది. నాటు నాటు పాటకు బాలీవుడ్ ఖాన్ త్రయంతో పాటు రాంచరణ్ చేసిన డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఈ పెళ్లికి వెయ్యి నుంచి 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్..! అంబానీ ఆస్తిలో అది 0.01 శాతం మాత్రమే. ఎంతైనా అంబానీ ఇంట్లో పెళ్లా మజాకా. ఆ మాత్రం ఖర్చు ఉంటుంది మరి.
- పి. వంశీకృష్ణ