లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఢిల్లీ విజ్ఞానభవన్ ప్లీనరీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్వర్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
543 లోక్ సభ స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 16లోగా ఆ ప్రక్రియ పూర్తిచేస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్ లో కూడా ఎలక్షన్ నిర్వహించాల్సి ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు:
దేశ వ్యాప్తంగా ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనున్నారు. మార్చి 20 నుంచి మొదలయ్యే ప్రక్రియ జూన్ 4న ఫలితాల ప్రకటనతో ముగియనుంది. ఫేజ్ – 4 లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మే 13న పోలింగ్ జరుగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు … తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.
96.8 కోట్ల మంది మొత్తం ఓటర్లు:
దేశ వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వారిలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ సారి 1.82 కోట్ల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 88.4 లక్షల మంది దివ్యాంగులు, 48 వేల మంది ట్రాన్స్ జెండర్లు కూడా ఓటేయనున్నారు. దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పిస్తోంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి:
ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 55 లక్షల ఈవీఎంలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 1.5 కోట్ల మంది సిబ్బంది, 2100 మంది అబ్జర్వర్లు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. వారందరికీ తగిన శిక్షణ ఇచ్చామన్నారు.
హింసకు పాల్పడితే కఠిన చర్యలు:
ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాజీవ్ కుమార్ హెచ్చరించారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వర్తించకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నామని చెప్పారు. నగదు పంపిణీ లేదా ఇతర ప్రలోభాలకు గురి చేస్తుంటే ఓటర్లు వాటిని ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
- పి. వంశీకృష్ణ