దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గత కొంతకాలంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సూచీలు బుధవారం భారీగా నష్టాలు చవిచూశాయి. ఉదయం లాభాలతోనే మొదలైనప్పటికీ తర్వాత ఎదురుగాలి వీచింది. సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్లు కోల్పోయి చివరకు 900 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. నిఫ్టీ సైతం 338 పాయింట్లు కోల్పోయి 21,997 దగ్గర స్థిరపడింది. ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, రిలయన్స్ షేర్ల అమ్మకాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మిగతా షేర్ల పరిస్థితీ అలాగే ఉండటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల 13 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
52 వారాల కనిష్టానికి..:
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లోని 160కు పైగా స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. సింధు ట్రేడ్, మార్షల్ మెషీన్స్, జీఆర్ఎం ఓవర్సీస్, సెల్లో వరల్డ్, బీజీఆర్ ఎనర్జీ వంటివి అందులో ఉన్నాయి. ఇక, 17 స్టాక్స్ మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. అవి 52 వారాల గరిష్టాన్ని తాకాయి. సోమీ కన్వేయర్, ఇంటెలిజెన్స్ డిజైన్, మోడ్రన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్ ఆ లిస్ట్ లో ఉన్నాయి. సెన్సెక్స్‌లో ఐటీసీ, ఐసీసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, కోటమ్ మహీంద్రా బ్యాంక్ తదితర షేర్లు లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 5 శాతానికి పైగా నష్టపోవడం ఆందోళన కలిగించే విషయం.
సెబీ వ్యాఖ్యలే కారణమా?
- చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు బబుల్స్ లా పెరుగుతూ వస్తున్నాయని అది సహేతుకంగా కనిపించడం లేదని.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ ఇటీవల అన్నారు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు, ఇన్వెస్టర్లు ఈ వ్యాఖ్యలను సమర్థించారు. స్టాక్ మార్కెట్ పై ఇది ప్రభావం చూపిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో దుబాయ్ కు చెందిన ఆపరేటర్ హరిశంకర్ టైబర్ వాలా ఖాతాలను ఈడీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. 30 లిస్టెడ్ కంపెనీల్లో అతడి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఇది కూడా ప్రభావం చూపింది. ఇలాంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి.
- పి. వంశీకృష్ణ