ఎన్నికల ముందు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం – సీఏఏను అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనల్ని నోటిఫై చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లోనే సీఏఏకు నాటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అనుమతి కూడా లభించింది. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆందోళనలు, పౌరసత్వ సవరణ చట్టంలో కొన్ని నిబంధనలపై సందిగ్ధత నేపథ్యంలో అది అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు అదిప్పుడు కార్యరూపం దాల్చింది.
సీఏఏలో ఏముంది..?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లో మతపరమైన హింస ఎదుర్కొని వలస వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశం. అలా తరలివచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు సిటిజన్ షిప్ ఇచ్చేందుకు ఈ చట్టం దోహదపడుతుంది. వారి దగ్గర సరైన ధ్రువీకరణ పత్రాలు లేనప్పటికీ పౌరసత్వాన్ని జారీ చేస్తారు. కాగా, 2014 డిసెంబర్ 31 కన్నా ముందు మన దేశానికి వచ్చిన వారు మాత్రమే దీనికి అర్హులవుతారు.
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లో మతపరంగా మైనారిటీలుగా ఉన్న వాళ్లు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ ఉపయోగపడుతుందని చెప్పారు. 2024 ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చి తీరుతామని అమిత్ షా చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే జరిగింది.
చట్టంలోని ముఖ్యాంశాలు..:
- పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి 2014 డిసెంబర్ 31 ముందు భారత్ కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు సీఏఏకు అర్హులు
- అలాంటి వాళ్లు గత 14 ఏళ్లలో కనీసం ఐదు సంవత్సరాలు భారత్ లో ఉండాలి
- మేఘాలయా, మిజోరం, అసోం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం నుంచి మినహాయించారు
- ఏ భారతీయుడి పౌరసత్వాన్ని కూడా ఈ చట్టం ద్వారా ఎట్టిపరిస్థితుల్లో తొలగించరు
సీఏఏ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అక్నాలెడ్జ్ మెంట్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత దరఖాస్తుదారులు సమర్పించిన డాక్యుమెంట్లను జిల్లా స్థాయి బృందం పరిశీలిస్తుంది. అనంతరం కొన్ని పరిశీలనల తర్వాత పౌరసత్వం ఇస్తారు.
- పి. వంశీకృష్ణ