ఎన్ఎస్డిసి & బజాజ్ ఫిన్సర్వ్ రెండు అవగాహన ఒప్పందాలను కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖల కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారీ, ఎఐసిటిసి మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ రాజీవ్ కుమార్; ఎన్ఎస్డిసి సిఇఓ మరియు ఎన్ఎస్డిసి ఇంటర్నేషనల్ ఎండి వేద మణి తివారీ, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్ & ఎండి శివ బజాజ్‌ల సమక్షంలో కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి బజాజ్ ఫిన్సర్వ్ గ్రూప్-సిఎస్ఆర్ కురుష్ ఇరానీ మరియు నేషనల్ హెడ్- సిఎస్ఆర్ పల్లవి గంగాధర్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ బజాజ్ ఫిన్సర్వ్ తో ఎన్ఎస్డిసి మరియు ఎఐసిటిఇ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా యువ పట్టభద్రులను ఆర్థిక సేవల రంగంలో ఉపాధి అవకాశాల కోసం సిద్ధం చేయడం కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ , బీమా రంగాల్లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేడు ఏర్పడిన భాగస్వామ్యాలు ఆర్థిక రంగంలో సామర్థ్యాలను పెంపొందిస్తాయని, ఆర్థిక మరియు డిజిటల్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల్లో భాగస్వామ్యమయ్యేలా మన యువతను శక్తివంతం చేస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ దార్శనికత, నిన్న ప్రారంభించిన వాయిస్ ఆఫ్ యూత్ కార్యక్రమం భారతదేశాభివృద్ధిలో యువత ఆలోచనలను వెలికి తీస్తాయని చెబుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశ రూపకల్పనలో నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక రంగాల పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. విజ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు మరియు సరైన వైఖరితో పురోగమించే వికసిత్ భారత్‌ను రూపొందించడంలో మన యువత కీలక పాత్ర పోషిస్తారని శ్రీ ప్రధాన్ స్పష్టం చేశారు. తాము విజ్ఞానం మరియు సామర్థ్యాలతో కూడిన సూపర్ హైవేని నిర్మిస్తున్నామని, ప్రపంచ ఆర్థిక సేవల మార్కెట్‌కు భారతదేశం ప్రధానకేంద్రంగా మారుతుందని ఆయన అన్నారు.
ఎఐసిటిసి ఛైర్మన్ ప్రొఫెసర్ టి.జి.సీతారాం తన అభిప్రాయాలను వెల్లడిస్తూ బజాజ్ ఫిన్సర్వ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడమనేది విద్య, మరియు పరిశ్రమ-విద్యారంగ అనుసంధానతల్లో కొత్త భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. పరిశ్రమలకు, విద్యారంగానికీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే ఎఐసిటిసి దృక్పథాన్ని ఇది బలోపేతం చేస్తుందనీ విద్య, ఆర్థిక, బ్యాంకింగ్, బీమా రంగాల్లోని విద్యార్థులకు ఇంటెర్న్షిప్లు, ఉద్యోగ శిక్షణ కోసం అపారమైన అవకాశాలను అందించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు.
ఎన్ఎస్డిసి సిఇఓ మరియు ఎన్ఎస్డిసి ఇంటర్నేషనల్ ఎండి వేద మణి తివారీ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక రంగం భారతదేశం యొక్క ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని మరియు అభివృద్ధిని సాధించిందని తెలిపారు. ఎన్ఎస్డిసిలో, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా విభిన్న అవకాశాలను అందించి, తద్వారా యువతకు సాధికారత కల్పించాలనే అంకితభావంతో ఉన్నామనీ, బజాజ్ ఫిన్సర్వ్ తో భాగస్వామ్యం ఆర్థిక రంగంలో పరిశ్రమ తాలూకు మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యం ప్రయత్నాలను సమలేఖనం చేసే వ్యూహాత్మక ఎత్తుగడను సూచిస్తుందనీ తెలిపారు.
బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, ఎన్ఎస్డిసి మరియు విద్యా మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం యువతకు నైపుణ్యతను ఎక్కువ అందుబాటులోకి తెచ్చి, విజయానికి అనంతమైన అవకాశాలను అందించడం ద్వారా వారి కోసం ఒక మార్పును తేవడానికి తమకు సహాయపడుతుందని అన్నారు. ఇది కౌశల్ భారత్, కుశాల్ భారత్ థీమ్‌కు అనుగుణంమైనదనీ, భవిష్యత్తు కోసం ఆర్థిక స్థితిస్థాపకతను, సమగ్ర శ్రామిక శక్తిని కూడా నిర్మిస్తుందనీ ఆయన చెప్పారు.
భాగస్వామ్యం కింద, బజాజ్ ఫిన్సర్వ్ పరిశ్రమ నిపుణులు, శిక్షణ భాగస్వాములు, విద్యా సంస్థలు, మానసిక ఆరోగ్య సంస్థల సహకారంతో రూపొందించిన బ్యాంకింగ్, ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ (సిపిబిఎఫ్ఐ)లో 100 గంటల తన సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ద్వారా 20,000 మంది అభ్యర్థులు తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడే నైపుణ్య కార్యక్రమాలను చేపడుతుంది, సిపిబిఎఫ్ఐ ప్రస్తుతం 23 రాష్ట్రాలు, 100 జిల్లాలు మరియు 160+ పట్టణాల్లోని 350+ కళాశాలల్లో నడుస్తోంది. ఇది ముఖ్యంగా ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాల్లో గ్రాడ్యుయేట్లు మరియు ఎంబిఎ ఆశవహుల్లో నైపుణ్యాలు, జ్ఞానం ,దృక్పథాన్ని పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది, ఆర్థిక సేవల రంగంలో వారు ఉపాధి పొందడానికి, దీర్ఘకాలికమైన వృత్తి జీవితానికీ సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది.
ఈ రెండు భాగస్వామ్యాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్, బ్యాంకింగ్ మరియు బీమారంగాల్లోని పరిస్థితులకు అనుగుణంగా క్రియాశీలకమైన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి, పరిశ్రమల్లోని తాజా పోకడలు, సాంకేతిక పురోగతి, ఉత్తమ అభ్యాసాలను పాఠ్యాంశాల్లో చేర్చాయి. ఎన్‌ఎస్‌డిసితో భాగస్వామ్యం నైపుణ్య భారత డిజిటల్ (ఎస్ఐడి) ద్వారా ఉన్నతీకరణ పొందుతుంది- ఇది ప్రభుత్వ నేతృత్వంలోని అన్ని నైపుణ్య, వ్యవస్థాపకతా కార్యక్రమాల సమగ్ర సమాచారానికి ప్రవేశద్వారం, విద్యార్థులు విద్యాపరంగా సన్నద్ధం కావడమే కాకుండా, ఈ రంగాల ఆచరణాత్మకమైన వాస్తవాల్లో వృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
విద్యార్థులకు అమూల్యమైన అవకాశాలను పెంపొందించడం కోసం ప్రతిష్టాత్మకమైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు బీమా కంపెనీలతో వ్యూహాత్మకమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను కూడా కుదుర్చుకోవడం జరుగుతుంది. ఇంటెర్న్షిప్లు, ఉద్యోగం చేస్తూ శిక్షణ పొందడం తదితరాలను ఈ భాగస్వామ్యాలు అందుబాటులోకి తెస్తాయి. వాస్తవ-ప్రపంచ పారిశ్రామిక పద్ధతులపై ప్రత్యక్ష సంగ్రహావలోకనాన్ని అందజేస్తాయి. తరగతి గదుల్లో నేర్చుకొనేవాటికీ, పారిశ్రామికమైన డిమాండ్‌కూ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తాయి, వృత్తిపరమైన పాత్రల్లో ఎలాంటి అవరోధాలూ పరివర్తన చెందడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి.
రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, ప్రామాణికంగా రూపొందించిన కమ్యూనికేషన్, పనిప్రదేశ నైపుణ్యాల ద్వారా అభ్యర్థుల విశ్వాసాన్ని పెంపొందించడాన్ని కూడా ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. సిపిబిఎఫ్ఐ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ద్వితీయ & తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 40,000 మందికి పైగా విద్యార్థులు శిక్షణ తీసుకున్నారు, ప్రయోజనం పొందారు.=
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని AICTE ఒడిశాను ప్రాధాన్యతా రాష్ట్రంగా గుర్తించింది. తత్ఫలితంగా, బజాజ్ ఫిన్సర్వ్ మరియు స్కిల్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన జాయింట్ సర్టిఫికేషన్నుపొందే విద్యార్థులతో ఒడిషాలోని పది జిల్లాల్లో మొదటి దశలో యువత నైపుణ్యం కార్యక్రమాల ప్రారంభం అవుతుంది.