పాడుబడ్డ ప్రదేశాలే కానీ పర్యాటకులు క్యూ కడుతున్నారు..!
అవన్నీ ఒకప్పుడు కళకళలాడిన ప్రాంతాలు. చూడగానే ఆకట్టుకునే ప్రదేశాలు. కానీ కాలక్రమంలో ప్రాభవాన్ని కోల్పోయాయి. చివరకు పాడుబడ్డ ప్రదేశాలుగా మిగిలాయి. చాలా ఏళ్లు వాటిని ఎవరూ పట్టించుకోలేదు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే … ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ ప్రాంతాలు పాపులర్ అవుతున్నాయి. పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి..? వాటి వెనకున్న కథేంటి..? తెల్సుకోవాలంటే ఇది చదవాల్సిందే.
(Kennecott Mines)
పాడుబడ్డ ప్రదేశంగా మిగిలిపోయి ప్రస్తుతం టూరిస్టులను ఆకర్షిస్తున్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది కెన్నెకాట్ గురించి. అమెరికా అలస్కాలోని కాపర్ రివర్ సెన్సస్ ఏరియలో ఇది ఉంది. ఒకప్పుడు కాపర్ మైనింగ్ కు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు ఆ అవశేషాలు మాత్రమే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ క్యాంపు, గనుల వ్యవహారాలను నేషనల్ పార్క్ సర్వీస్ పర్యవేక్షిస్తోంది. అక్కడికి వచ్చే పర్యాటకులకు అవసరమైన సదుపాయాలను కూడా కల్పిస్తోంది.
(Craco, Italy)
ఇటలీలోని క్రాకో..! భారీ బడ్జెట్ సినిమా సెట్టింగ్ ను తలదన్నే రీతిలో ఈ పట్టణ నిర్మాణం ఉంటుంది. చూడగానే వింత అనుభూతి కలుగుతుంది. అయితే ఎత్తైన కొండపై దీన్ని నిర్మించారు. అదే క్రాకోకు పెద్ద మైనస్ అయింది. తరచూ కొండచరియలు విరిగిపడటం, భూకంపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడి జనం ఈ పట్టణాన్ని విడిచిపెట్టారు. టూరిస్టులు మాత్రం ఇప్పుడు అక్కడికి క్యూ కడుతున్నారు.
(Kilchurn Castle, Scotland)
స్కాట్లాండ్ లొకావేలోని కిల్చర్న్ క్యాసల్ కూడా ఇదే కోవకు చెందుతుంది. శతాబ్దాల క్రితం ఈ కోట స్కాట్లాండ్ ప్రభువులకు ముఖ్యమైన నివాస ప్రాంతంగా ఉండేది. కానీ క్రీ.శ 1700 సంవత్సరం నుంచి నిరాదరణకు గురైంది. సెల్ఫ్ డ్రైవ్ హాలిడే వెకేషన్ కు వెళ్లే వారికి ఈ ప్రాంతం బెస్ట్ ఛాయిస్.
(Deception Island, Antarctica)
మంచుతో నిండిన అంటార్కిటికా ఖండాన్ని విజిట్ చేసే వారికి అక్కడి డిసెప్షన్ ఐలాండ్ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. తిమింగలాల వేటకు, పరిశోధనకు అనుకూలమైన ప్రాంతమిది. కానీ కాలక్రమంలో దీనికి ఆదరణ తగ్గిపోయింది. సముద్ర సింహాలు, పెంగ్విన్ లు మాత్రమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఒకవేళ టూరిస్టులు డిసెప్షన్ ఐలాండ్ కు వెళ్లాలనుకుంటే ముందుగానే క్రూయిజ్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
(Houtouwan, Shengshan Island, China)
చైనాలోని హౌటవాన్..! సహజ సిద్ధమైన అందాలకు చిరునామా. ఒకప్పుడు ఇది ఫిషింగ్ విలేజ్ గా ఉండేది. రానురాను అది కనుమరుగైపోయింది. కానీ ఇక్కడ పచ్చటి ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఉండే ఇళ్లు, పరిసరాలు చూపు తిప్పుకోనీయవు. అద్భుతమైన లొకేషన్లు ఫొటోగ్రాఫర్లను కట్టిపడేస్తాయి.
(Kuldhara, Rajasthan, India)
రాజస్థాన్ జైసల్మేర్ లోని కులధార గ్రామం 19వ శతాబ్దం నుంచి నిరాదరణకు గురైంది. అక్కడి ప్రజలు రాత్రికి రాత్రే ఆ ఊరిని విడిచిపెట్టిపోయారని చెప్తారు. అందుకు కారణం మాత్రం ఏంటో తెలియదు. అదొక పెద్ద మిస్టరీ. ఈ పరిస్థితుల్లో కులధార ఇప్పుడో హాంటెడ్ విలేజ్ గా మిగిలిపోయింది.
కేవలం ఇవే కాకుండా నమీబియాలోని కోల్మాన్ స్కోప్, చైనాలోని టియాండుచెంగ్ వంటి ప్రాంతాలు కూడా పాడుబడ్డ పర్యాటక ప్రదేశాలుగా మిగిలిపోయాయి. పర్యాటకులను మాత్రం ఆకట్టుకుంటున్నాయి.
– పి. వంశీకృష్ణ