తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

సాగునీటి రంగం అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. 2014 లో రాష్ట్ర అవతరణ తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వం సాగునీటి పారుదలకు అగ్రస్థానం ఇవ్వటంతో గత ఎనిమిదేళ్ళ వ్యవధిలో రాష్ట్ర నీటి పారుదల రంగం అత్యున్నత స్థితికి చేరింది. తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిరకాల వాంఛ నెరవేరటంలో ఎన్నో మైలురాళ్ళున్నాయి.

నీటి ప్రాజెక్టుల రూపకల్పన, వాటిని నిర్ధేశించిన వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఏన్నో సమావేశాలు, కార్యశాలలు ముఖ్యమంత్రి ముందుండి నిర్వహించారు. సుధీర్ఘ యజ్ఞం అయిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటంలో పలు మేధోమథన సదస్సులకు రూప కల్పన చేసి శరవేగంగా నిర్మాణం పూర్తయ్యే వరకు వ్యూహాత్మక చర్యలు తీసుకొన్నారు. ఫలితంగా ప్రాజెక్టులన్నీ కూడా సరికొత్త రూపును సంతరించుకున్నాయి. అలాగే పాత ప్రాజెక్టులను విప్లవాత్మక రీతీలో ఆధునీకరించటం వలన సాగు నీటి రంగం విస్తీర్ణం పెరిగింది.

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గణాంక 2022 నివేదిక ప్రకారం సాగునీటి విస్తీర్ణం 2014 సంవత్సరంలో కేవలం 62 లక్షల 48 వేల ఎకరాలకు ఉండగా, 2022 నాటికి సాగునీటి విస్తరణ 1 కోటి 35 లక్షల 60వేల ఎకరాలకు పెరిగింది. 2014 రాష్ట్రంలోని సాగునీటి అత్యవసరాలను దృష్టి యందుంచుకొని ప్రాజెక్టుల రీడిజైనింగ్ ,రీ ఇంజనీరింగ్ వంటి వినూత్న ప్రణాళికతో కార్య క్షేత్రంలోకి దిగిన ప్రభుత్వం విజయవంతంగా ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది. 24 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో రాష్ట్రంలో 69.02 లక్షల ఎకరాల ఆయకట్టు కొనసాగుతున్నది.

Poultary

వాటి క్రింద తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కొత్తగా 19.48 లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం పెంచడం జరిగింది. 27 మధ్యతరహా ప్రాజెక్టుల పరిదిలో దాదాపు 3 లక్షల 4 వేల ఎకరాల అయకట్టుకు, చిన్న తరహా ప్రాజెక్టులు, లిప్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో మరో 5 లక్షల 53 వేల ఎకరాలకు, మరో 9 మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల పరిదిలో 21 లక్షల 33వేల ఎకరాలకు నీటి సరఫరా పెంచడం జరిగింది.

కల్వకుర్తి,నెట్టంపాడు,కోయల్ సాగర్,ఎల్లంపల్లి,మిడ్ మానేరు,దేవాదుల,తదితర ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసింది. ఫలితంగా సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.డిండి,గట్టు ఎత్తిపోతల, చనాకా- కొరాటాపోరాట తదితర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్ , నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి పాత ప్రాజెక్టుల కాలువలను ఆధునీకరించింది.కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచం లోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు. విభిన్న రీతిలో డిజైన్ చేసిన భారీ ప్రాజెక్టు ఇది.

తెలంగాణ లో సాగు నీటికి ఇంత వరకు నోచుకోని భూములకు నీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన బహుళ దశల ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు లో భాగమైన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా నదీ –వాగు, ఏదీలేనిచోట అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ నిర్మాణం కావడం సాగునీటిరంగ చరిత్రలోనే ఒక అధ్బుతం.

అంతే కాకుండా గోదావరి నీటిని 90 మీటర్ల నుండి 618 మీటర్లకు ఎత్తి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ ఇందులో ప్రధానాంశం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో తనకు తానే సాటి అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకున్నది. గోదావరి నది పై మూడు బ్యారేజిలు , 20 మెగా నీటి లిఫ్ట్ లు ,21 పంపు హౌజ్ లు , 180 రిజర్వాయర్లతో పాటు 1832 కి.మీ పొడవునా సొరంగమార్గాలు, పైపులైన్లు, కెనాల్స్ నిర్మించారు. మూడు సంవత్సరాల వ్యవధి లో అతి భారీ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు నెలకొల్పిందంటే అతిశయోక్తి కాదు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకానికి సైతం కాళేశ్వరం జలాలను వినియోగిస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణం తో గోదావరి లో నిరంతరం 100 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉండేలా చేసింది .

నీటి పారుదల రంగం లో జరిగిన అభివృద్దితో ఆయకట్టు 119 శాతం పెరిగింది. సముద్రంలోకి వృధాగా వెళ్ళే గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవటంలో తెలంగాణ సఫలీకృతమైంది.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని ఏలూరు వద్ద శ్రీశైలం రిజర్వాయర్ ముందు తీరం నుండి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు వలన నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్ , నారాయణపేట్ , రంగారెడ్డి , నల్గొండ జిల్లాలోని ఎగువ ప్రాంతం లో కల 12.30 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు రూపకల్పన జరిగింది. ఈ జిల్లాల్లోని కరువు ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం ఈ ప్రాజెక్ట్.

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ : గోదావరి నీటిని తరలించి భద్రాద్రి – కొత్తగూడెం,ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి 2022 నాటికి 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు బాగు చేయడంతో చెరువుల కింద 25 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. భూగర్భ జలాలు తెలంగాణ వ్యాప్తంగా గణనీయంగా పెరిగి వ్యవసాయ సాగు కూడా రెట్టింపు అవుతున్నది.

సాగు విస్తీరణ పెరిగి దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. దీంతో వ్యవసాయం పురోగతి చెంది 2 కోట్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టె అన్న పూర్ణగా అవతరించింది. ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజేక్టుల నిర్మాణం వలన రాష్ట్రంలో వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర స్తూల ఉత్పత్తి (GSDP) కూడా గణనీయంగా పెరుగుతున్నది. దేశంలోనే తెలంగాణ వ్యవసాయ రంగం “న భూతో న భవిష్యత్ గా” నిలుస్తున్నది.

నీటితీరువా పన్నురద్దు :
తెలంగాణరాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతులు చెల్లించాల్సిఉన్న నీటితీరువా పన్ను బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రద్దు చేసింది. అంతే కాకుండా శాశ్వతంగా నీటిపన్నును రద్దుచేసి, రైతులకు ఉచితంగా సాగునీటిని అందిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ సాగునీటి రంగం, దేశ నీటిపారుదల చరిత్రలో సరికొత్త అధ్యాయం గా నిలిచింది.

 

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here