ఆసియా దేశాల్లో బయోటెక్నాలజికల్ విద్య అభివృద్ధితో పాటు సహకారం పెంపొందే దిశగా కీలక అడుగుపడింది. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తు డౌ మోట్ విశ్వవిద్యాలయం(టి.డి.ఎం.యు)తో ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్స్ – ఎఫ్.ఎ.బి.ఎ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సెప్టెంబర్ 23న ఈ ఎంఓయూ జరిగింది. దీనివల్ల వియత్నాంలో ఎఫ్.ఎ.బి.ఎ ఛాప్టర్ ను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. ఆగ్నేయాసియాలో దాని ఉనికిని, ప్రభావాన్ని విస్తరించేందుకు ఇది దోహదపడనుంది.
బయోటెక్నాలజీ రంగంలో రీసెర్చ్ & డెవలప్ మెంట్ కు టి.డి.ఎం.యులో ఏర్పాటయ్యే కొత్త శాఖ ఉపయోగపడుతుంది. దీనిపై ఎఫ్.ఎ.బి.ఎ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ రెడ్డన్న స్పందించారు. వియత్నాంలో ఈ విస్తరణ తమకెంతో ముఖ్యమైనదని చెప్పారు. టి.డి.ఎం.యులోని విద్యా వనరులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎఫ్.ఎ.బి.ఎ శాఖలతో ఇంటిగ్రేట్ చేసి.. బయోటెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
టి.డి.ఎం.యు అనేది వియత్నాంలోని బిన్ దువాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ముఖ్యమైన విద్యా సంస్థ..! 2009లో ఇది ఏర్పాటైంది. రకరకాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ను టి.డి.ఎం.యు అందిస్తుంది. స్థానిక, జాతీయ మార్కెట్ అవసరాలను తీర్చే విధంగా అన్వయంతో కూడిన పాఠ్యక్రమంపై దృష్టి సారిస్తోంది. సామాజిక-ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా లర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్ మెంట్ లో పని చేస్తుంది. బిన్ దువాంగ్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
ఎఫ్.ఎ.బి.ఎ, టి.డి.ఎం.యు ఒప్పందంలో భాగంగా ఉమ్మడి పరిశోధనా ప్రాజెక్టులు, సెమినార్లు, వర్క్ షాప్స్ నిర్వహిస్తారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు.. నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ఇవి దోహదపడతాయి. అలాగే బయోటెక్ నిపుణులకు ఇది సరైన వేదికగా మారుతుంది. అంతేకాకుండా రెండు సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది.
అటు, వియత్నాంలోని బిన్ డుయోంగ్ బిజినెస్ అసోసియేషన్ – బి.డి.బి.ఎతోనూ ఎఫ్.ఎ.బి.ఎ ఒప్పందం కుదుర్చుకుంది. వియత్నాం, భారత్ మధ్య బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొలాబొరేటివ్ వెంచర్స్ ను ప్రోత్సహించేందుకు కావాల్సిన సహకారాన్ని అందిస్తుంది. ఇది కేవలం అడ్వాన్డ్స్ సైంటిఫిక్ కొలాబ్రేషన్ కోసం మాత్రమే కాదని.. ఇరు దేశాల మధ్య బిజినెస్ డైనమిక్స్ ను క్యాటలైజ్ చేసేందుకు.. బయోటెక్నాలజికల్ అడ్వాన్స్ మెంట్స్ కమర్షియల్ సక్సెస్ సాధించేందుకు తోడ్పడుతుందని ఎఫ్.ఎ.బి.ఎ సెక్రెటరీ జనరల్ డాక్టర్ రత్నాకర్ పాలకోడేటి తెలిపారు.
ఈ అవగాహన ఒప్పందాలపై డాక్టర్ పి. రత్నాకర్ తో పాటు తు డౌ మోట్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ నుయెన్ థి లియన్ థుంగ్… బిన్ డుయోంగ్ బిజినెస్ అసోసియేషన్ నుంచి నుయెన్ థాన్ టిన్ సంతకాలు చేశారు. ప్రొఫెసర్ రెడ్డన్న, చక్రవర్తి, ఎఫ్.ఎ.బి.ఎ ఇతర కార్యనిర్వాహక సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.