Sri Ramanavami ..! ధర్మానికి ప్రతిరూపమైన రామచంద్రుణ్ని స్మరిస్తూ యావత్ భక్తజనం జరుపుకునే పర్వదినం..! శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన శుభదినం..! చైత్ర శుద్ధ నవమి రోజు వచ్చే శ్రీరామ నవమి నాడు రఘునందనుణ్ని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఎన్నో విశిష్టతలున్న ఈ పండుగకు సంబంధించి మరిన్ని విశేషాలు మీ కోసం.
దశావతారాల్లో ఏడవది రామావతారం. ధర్మ సంరక్షణ కోసం ఆ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించాడు. ఆ రోజునే శ్రీరామ నవమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామ జననంతో పాటు ఈ నవమికి మరో రెండు విశిష్టతలున్నాయి. ఒకటి సీతారామ కల్యాణం, రెండోది శ్రీరామ పట్టాభిషేకం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
కన్నుల పండుగగా Sri Ramanavami కల్యాణం:
దశరథ మహారాజు కౌసల్య దేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే తిథి రోజు సీతారాముల కల్యాణం జరిగిందని విశ్వసిస్తారు. అందుకే శ్రీరామ నవమి రోజు కల్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
తెలంగాణలోని భద్రాచలంలో ఆ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొని సీతారాముల సేవలో తరిస్తారు.
శ్రీరామ నవమి రోజు దేవాలయాలన్నీ కిటకిటలాడుతాయి. ఆ రోజు స్వామి వారికి వడపప్పు, పానకం నైవేద్యంగా పెడతారు. దాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.
చైత్ర శుద్ధ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు నెరవేరుతాయని… దోషాలన్నీ తొలగిపోతాయని.. జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
విష్ణుమూర్తి రామావతారంలో మానవ రూపంలో అన్ని కష్టాలు అనుభవించాడు. మనుషులు ఎలా జీవించాలో చూపించాడు. రావణున్ని వధించి ధర్మాన్ని రక్షించాడు. మాటకు ఎలా కట్టుబడి ఉండాలి? తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి? రాజ్యాన్ని సుభిక్షంగా ఎలా పరిపాలించాలి? ఇలాంటి సుగుణాలన్ని రాముణ్ని చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఆయనను సకల గుణాభిరాముడని అంటారు.
- పి. వంశీకృష్ణ