అక్షర యోధుడు అస్తమించాడు. తెలుగు మీడియా మొఘల్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. *(Ramoji Rao Passes Away)* సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యుడిగా ఎదిగిన చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూశారు.
(Ramoji Rao Passes Away) హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
1936 నవంబర్ లో కృష్ణా జిల్లాలో రామోజీరావు జన్మించారు. చిన్ననాటి నుంచే సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. 1974 ఆగస్టులో ఈనాడు దినపత్రికను స్థాపించి సంచనలం సృష్టించారు.
అనతికాలంలోనే అది పాఠకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత సితార సినీ పత్రిక, ఈటీవీ ఛానళ్లను తీసుకొచ్చి మీడియా రంగంలో మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు.
హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీ నిర్మించి షూటింగులన్నీ అక్కడే జరిగేలా వసతులు కల్పించారు.
అన్నదాత సుఖీభవ..:
రైతుల కోసం అన్నదాత మేగజైన్ ప్రారంభించారు. అలాగే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై 80కి పైగా సినిమాలను నిర్మించారు.
శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌనపోరాటం, ప్రతిఘటన, మనసు మమత, అమ్మ.. ఇలాంటి ఎన్నో హిట్ చిత్రాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు.
ఇక, బుల్లితెరపై ఈటీవీ ఛానళ్లు ఒక ట్రెండ్ ను సెట్ చేశాయి. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాల భారత్ వంటి ఛానళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈటీవీ న్యూస్ నెట్ వర్క్ ద్వారా 13 భాషల్లో వార్తా ప్రసారాలను అందించారు.
అటు, ప్రియా పచ్చళ్లతో ప్రపంచానికి తెలుగు వంటకాల రుచులను పరిచయం చేశారు రామోజీరావు. మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్.. ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో నడిచేవే.
పొందిన అవార్డులు ఇవే..:
రామోజీరావును మన దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. అలాగే నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు (సౌత్), ఐదు నంది పురస్కారాలు దక్కాయి.
ప్రముఖుల సంతాపం..:
అడుగుపెట్టిన ప్రతిరంగంలో విజయాన్ని సాధించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీనటులు చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు తదితరులు సంతాపం తెలిపారు.
ప్రజల సందర్శనార్థం రామోజీరావు పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. వేలాది మంది అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.
ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.