ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ జరిగింది. ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో … ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 44 మంది ఎంపీలు సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయగా .. 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ లో పోలింగ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సచివాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు నేతలు పార్లమెంట్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీలు రాహుల్ గాంధీ, శశి థరూర్ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర పార్టీల ఎంపీలు సైతం పోలింగ్ కు హాజరయ్యారు.
మరోవైపు, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేయగా ఆ తర్వాత ఎమ్మెల్యేలు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత .. సీఎం కేసీఆర్ ఓటు వేశారు. మన రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119. అనివార్య కారణాల వల్ల మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పోలింగ్ లో పాల్గొనలేదు. మిగతా మిగిలిన 117 మంది మాత్రం రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్నారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా తెలంగాణలో ఓటు హక్కు వినియోగిచుకున్నారు. అటు, అమరావతి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీఎం జగన్ తో పాటు ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్.డి.ఎ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము … విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నిల్చున్నారు. అయితే సంఖ్యా బలం దృష్ట్యా ముర్ము గెలుపు లాంఛనం కానుంది.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఆధారంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇండియాలో ప్రస్తుతం (నామినేటెడ్ కాకుండా) లోక్ సభ, రాజ్యసభ ఎంపీల సంఖ్య 776. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 4033. ఆయా ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని బట్టి ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది. ఇదే ఎలక్టోరల్ కాలేజీ. ఆ విలువ ప్రస్తుతం 10,86,431గా ఉంది. ఈ మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో ముర్ముకు 60 శాతానికి పైగా ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, ఎన్.డి.ఎ మిత్రపక్షాలతో పాటు బి.జె.డి, వై.సి.పి, టి.డి.పి, అకాలీదళ్ తదితర పార్టీలు ముర్ముకే మద్దతు ప్రకటించాయి. దీంతో ఆమె విజయం దాదాపుగా ఖాయమైంది.
ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.