తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేకేత్తించాయి. (Lok Sabha Election Results 2024) మొత్తం 17 సీట్లకుగానూ బీజేపీకి 8, కాంగ్రెస్ కు 8 స్థానాలు దక్కాయి. ఎంఐఎం పార్టీ ఒక సీటును కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణీ కొట్టలేదు. (Lok Sabha Election Results 2024)
గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్ నుంచి నగేశ్ 84 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ నుంచి 2 లక్షల 21వేలకు పైగా మెజార్టీతో బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ నుంచి లక్షా 9 వేలకు పైగా మెజార్టీతో ధర్మపురి అర్వింద్ విక్టరీ కొట్టారు.
మెదక్ నుంచి 35 వేలకు పైగా మెజార్టీతో రఘునందన్ రావు, మల్కాజ్ గిరి నుంచి 3 లక్షల 87 వేలకు పైగా మెజార్టీతో ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి 50 వేలకు పైగా మెజార్టీతో కిషన్ రెడ్డి గెలుపొందారు.
చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లక్షా 65 వేలకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. మహబూబ్ నగర్ లో 3 వేల 600పైగా ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయం సాధించారు.
కాంగ్రెస్ గెలిచిన స్థానాలు ఇవే..:
కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికొస్తే.. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ లక్షా 31వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సత్తా చాటారు. జహీరాబాద్ నుంచి 47 వేలకు పైగా మెజార్టీతో సురేశ్ షెట్కర్, నాగర్ కర్నూల్ నుంచి 94 వేలకు పైగా మెజార్టీతో డాక్టర్ మల్లు రవి, నల్లగొండ నుంచి 5 లక్షల 60 వేల మెజార్టీతో రఘువీర్ గెలుపొందారు.
భువనగిరి నుంచి 2 లక్షల 22 వేలకు పైగా మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి 2 లక్షల 19వేలకు పైగా మెజార్టీతో కడియం కావ్య విక్టరీ కొట్టారు. మహబూబాబాద్ నుంచి బలరామ్ నాయక్ 3 లక్షల 44 వేలకు పైగా ఓట్లతో గెలవగా.. ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి 4 లక్షల 60 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.
ఇక హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఆయన 3 లక్షల 38 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇదీ పరిస్థితి..:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది. మెజార్టీ అసెంబ్లీ సీట్లతో పాటు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది. 175 అసెంబ్లీ సీట్లకుగానూ టీడీపీకి 136, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. వైఎస్ ఆర్ సీపీ పది సీట్లకే పరిమితమైంది.
అటు, ఏపీలో 25 లోక్ సభ నియోజకవర్గాలుండగా టీడీపీ 16 సీట్లను కైవసం చేసుకుంది. జనసేనకు 2, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. వైఎస్సార్ సీపీ 4 స్థానాల్లో విజయం సాధించింది.
ఇక, దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి హవా కొనసాగింది. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి 290కు పైగా స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఇండియా కూటమికి 198కు పైగా సీట్లు దక్కాయి. ఇతరులు 50కి పైగా స్థానాలను గెల్చుకున్నారు.
- పి. వంశీకృష్ణ