Kondagattu..! తెలంగాణలో ప్రముఖ దివ్యక్షేత్రం..! హనుమంతుడు కొలువుదీరిన పుణ్య ప్రదేశం..! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆలయంలో ఆంజనేయ స్వామితో పాటు వేంకటేశ్వరుడు , ఆళ్వారుల, లక్ష్మీ దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి.
మానసిక వైకల్యం లేదా అనారోగ్యంతో బాధపడే వాళ్లు.. ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. (Kondagattu Hanuman Temple History)
ఎన్నో విశిష్టతలున్న కొండగట్టు ఆలయ చరిత్ర, హనుమాన్ జయంత్రి ప్రత్యేకత.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీ కోసం. (Kondagattu Hanuman Temple History)
జగిత్యాలకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంది. ఈ క్షేత్రం ఆవిర్భావం వెనుక ఎంతో చరిత్ర దాగుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్తాడు.
తిరిగి వస్తుండగా సంజీవనిలో కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందట. కాలక్రమంలో అదే కొండగట్టుగా మారిందని చెపుతారు.
కొండగట్టులో స్వామి స్వయంభువుగా వెలిశారు. ఇక్కడి విగ్రహానికి రెండు ముఖాలు ఉంటాయి. వాటిలో ఒకటి హనుమంతుడిది కాగా రెండోది నరసింహ స్వామి వారిది. స్వామి భుజాలపై శంఖుచక్రాలు, ఛాతీ మీద సీతారాముల రూపం కూడా కనిపించడం మరో విశేషం.
వందల ఏళ్ల కిందటి గుడి:
దాదాపు నాలుగు వందల ఏళ్ల కిందటి మాట ఇది..! ఆ సమయంలో సంజీవుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతడు ఆవులు మేపుతూ ఇదే కొండ ప్రాంతానికి చేరుకున్నాడు.
అప్పుడు ఒక ఆవు మంద నుంచి తప్పిపోయింది. దాన్ని వెతుకుతూ సంజీవుడు అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు ఆంజనేయస్వామి అతడి కలలో కనిపించి.. తాను సమీపంలో ఒక పొదలో ఉన్నానని..
ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా ఏదైనా ఏర్పాటు చేయమని చెప్తాడు. అలాగే ఆవు జాడ కూడా చెప్పి అదృశ్యమవుతాడు.
ఆ తర్వాత సంజీవుడు నిద్రలేచి వెతకగా హనుమంతుడి విగ్రహం కనిపించింది. తప్పిపోయిన ఆవు కూడా కంట పడింది. దీంతో, సంజీవుడు కొందరు సహచరులతో కలిసి స్వామికి చిన్న గుడి కట్టించినట్టు చెపుతారు.
కొండగట్టు ఆంజనేయుడు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. సంతానం లేని వారు, అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడ 40 రోజుల పాటు పూజ చేస్తే వారి సమస్యలు తీరుతాయని నమ్ముతారు.
కొండగట్టలో ప్రధాన ఆలయం వెనుక బేతాళస్వామి గుడి, ముందుభాగంలో సీతమ్మవారి కన్నీటి చారలు కనిపిస్తాయి. అరణ్యవాసంలో శ్రీరాముడి కష్టాలు చూసి బాధపడిన జానకీమాత ఇక్కడే కన్నీరు కార్చిందని చెపుతారు.
ఈ ప్రాంతంలో మరికొన్ని చూడాల్సిన ప్రదేశాలున్నాయి. కొండల రాయుని స్థావరం, మునుల గుహ,
తిమ్మయ్యపల్లె శివారులో జొజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, శ్రీరామ పాదుకలు వీటన్నింటినీ వీక్షించవచ్చు.
ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం కాబట్టే కొండగట్టుకు భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతితో పాటు అనేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామి మాలను ధరించి దీక్ష చేపడతారు. ఆ సమయంలో కొండగట్టు మొత్తం కాషాయమయంగా మారుతుంది.
- పి. వంశీకృష్ణ