మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి 2022: మీ తప్పుల వల్లే భారీ వర్షాలు
Rangam Bhavishyavani 2022: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రంగం ఘట్టం జరిగింది. పచ్చి కుండపై నిల్చుని జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
భక్తులు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఇప్పుడు పూజలు జరగటం లేదని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. పూజలు భక్తుల సంతోషానికే తప్ప తనకోసం కాదని స్వర్ణలత స్పష్టం చేశారు. భక్తుల కళ్ళు తెరిపించడానికే ఇలా భారీ వర్షాలు కురిపిస్తున్నట్టు చెప్పారు.
తన రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని స్వర్ణలత మండిపడ్డారు. ప్రతి ఏటా రూపాన్ని మారుస్తూ వస్తున్నరని అన్నారు. అలా కాకుండా తన రూపాన్ని స్థిరంగా ఉంచాలని సూచించారు. గర్భాలయంలో పూజలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. తన భక్తులు ఎన్ని తప్పులు చేసినా కూడా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. జనానికి ఎలాంటి ఆపదా రాకుండా చూస్తానని అన్నారు.
కాగా, లష్కర్ బోనాల్లో నిర్వహించే రంగం ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అవివాహిత అయిన జోగిని శరీరంలోకి అమ్మవారు ప్రవేశించి … స్వయంగా భవిష్యవాణి వినిపిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏటా బోనాల సందర్భంగా రంగాన్ని నిర్వహిస్తారు.
భవిష్యవాణి అనంతరం అంబారీ ఊరేగింపు ఘనంగా జరిగింది. అమ్మవారి పటాన్ని ఏనుగుపై ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో ఇందులో పాల్గొన్నారు.