సార్వత్రిక ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. దేశ వ్యాప్తంగా 7 దశల్లో జరిగిన ఎలక్షన్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. (India Created World Record) ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
Chief Election Commissioner రాజీవ్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల విశేషాలను వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.(India Created World Record)
దీని ద్వారా ఓటింగ్ లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని రాజీవ్ కుమార్ అన్నారు. ఈ సారి మహిళా ఓటర్లు పోటెత్తారని.. 31.2 కోట్ల మంది స్త్రీలు ఓటు వేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
మన దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య.. జీ-20 దేశాల్లో మొత్తం ఓటర్ల కన్నా 1.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం.
సీఈసీ ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు:
- ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. కోటీ యాభై లక్షల మంది పోలింగ్, భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
- 68,763 బృందాలు ఎన్నికల సరళిని పరిశీలించాయి. ఎలక్షన్స్ కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించారు. 135 ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించారు.
- గతంతో పోలిస్తే ఈ సారి రీ-పోలింగ్ భారీగా తగ్గింది. గత ఎన్నికల్లో 540 చోట్ల రీ-పోలింగ్ జరగగా ఈ సారి అది 39 ప్రాంతాలకే పరిమితమైంది.
- 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రీ-పోలింగ్ అవసరం పడలేదు.
- గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే ఈ సారి జమ్ముకశ్మీర్ లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. 58.58 శాతం మంది అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.
- కశ్మీర్ వ్యాలీలో 51.05 శాతం పోలింగ్ నమోదైంది.
- ఎన్నికల సందర్భంగా రూ. 10 వేల కోట్ల నగదు, డ్రగ్స్, గిఫ్ట్స్, లిక్కర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు ప్రవాహానికి విజయవంతంగా అడ్డుకట్ట వేశారు.
- ఎలక్షన్ టైంలో సీ-విజిల్ యాప్ ద్వారా 4 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. వాటిలో 99.9 శాతానికి పైగా కంప్లైంట్స్ ను అధికారులు పరిష్కరించారు. డీప్ ఫేక్ వీడియోలను కూడా అడ్డుకున్నారు.
- జూన్ 4వ తేదీ (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
– పి. వంశీకృష్ణ