తెలంగాణలో సినిమా అవార్డుల శుభపరిణామం మళ్లీ మొదలైంది! గత 14 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ చలనచిత్ర అవార్డులను తిరిగి ప్రారంభిస్తూ, ఈసారి ప్రజాకవి గద్దర్ గారిని స్మరించుకుంటూ అవార్డులకు ఆయన పేరును జతచేశారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ నిర్ణయాన్ని అవార్డుల కమిటీ చైర్‌పర్సన్ జయసుధ గారు అధికారికంగా వెల్లడించారు.
గద్దర్ సినిమా అవార్డుల వెనుక గొప్ప ఉద్దేశం
తెలుగు సినిమా కృషిని గుర్తించడానికి మరియు ప్రోత్సహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నటీమణి జయసుధ నేతృత్వంలో ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ: “ఏ ఒత్తిళ్లు లేకుండా, ప్రామాణికంగా, పూర్తిగా పారదర్శకతతో అవార్డులను ఎంపిక చేశాం. అవార్డులు కళాకారులకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. ఈ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది.” అని తెలిపారు.


దిల్ రాజు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ — “14 ఏళ్ల తరువాత ప్రభుత్వం నుంచి అవార్డులు రావడం సంతోషకర విషయం. నిజమైన ప్రతిభకు గౌరవం దక్కేలా జ్యూరీ పనిచేసింది.” అని చెప్పారు.
జ్యూరీ నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మరియు దిల్ రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
జూన్ 14న హైటెక్స్ ప్రాంగణంలో గద్దర్ సినీ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది.
2014 నుంచి 2023 మధ్యకాలంలో విడుదలైన ఉత్తమ చిత్రాలకు సంబంధించి అవార్డులను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు జయసుధ గారు తెలిపారు.
క్రింది విభాగాలలో 2024 విజేతలు:
మొదటి ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్
మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేతా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన – ‘నిజమే నే చెబుతున్నా..’)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయ ఘోషల్ (పుష్ప 2 – ‘సూసేకి అగ్గిరవ్వ కళ్లెత్తితే..’)
ఉత్తమ హాస్య నటులు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
ఉత్తమ బాల నటులు: మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి).
ఉత్తమ బాలల చలన చిత్రం: 35 చిన్న కథ కాదు
ఉత్తమ పర్యావరణం/వారసత్వం/చరిత్ర చలన చిత్రం: రజాకార్
ఉత్తమ తొలి చలన చిత్రం: ఎదు వంశి (కమిటీ కుర్రాళ్లు)
డాక్టర్. ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్.. మేం ఫ్రెండ్స్ అండి
ఉత్తమ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి చలన చిత్రం: కమిటీ కుర్రాళ్లు
ఈసారి అవార్డులు కేవలం పేరున్న వారికోసం కాదని, నిజంగా పనితో మెరిసిన ప్రతిభావంతుల కోసం మాత్రమే అని జ్యూరీ సభ్యులు స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయం టాలీవుడ్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. రాజకీయాల ప్రభావం లేకుండా, నిస్పాక్షికంగా తీసుకున్న ఈ చర్య, కళాకారులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, అభిమానుల హృదయాల్లో కూడా విశ్వాసం పెంచింది.