ఎన్నికలంటే ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లు గుర్తొచ్చేవి. కానీ వాటి ప్లేస్ ను ఈవీఎంలు రీ-ప్లేస్ చేశాయి. (Electronic Voting Machines) చాలా ఏళ్లుగా పోలింగ్ కేంద్రాల్లో ఆ యంత్రాలనే మనం చూస్తున్నాం.
మరింతకీ ఈవీఎంలు ఎలా పని చేస్తాయి? తొలి మెషీన్ ను ఎప్పుడు వాడారు? బ్యాలెట్ పేపర్ బెటరా? లేక ఈవీఎం సేఫా? ఇలాంటి వివరాలన్నీ మీ కోసం (Electronic Voting Machines).
Electronic Voting Machine. షార్ట్ కట్ లో ఈవీఎం. ఓట్లను రికార్డు చేయడంతో పాటు లెక్కించేందుకు ఉపయోగించే Electronic Device ఇది.
1982లో కేరళలోని పర్వూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎలక్షన్ లో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు.
Electronic Voting Machines లో ఏయే విభాగాలుంటాయి?
ఈవీఎంలో ముఖ్యమైనవి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్. వాటితో పాటు Voter verifiable paper audit trail – VVPAT కూడా ఉంటుంది.
కంట్రోల్ యూనిట్ ను ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధీనంలో ఉంచుతారు. బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ ను ఓటింగ్ కంపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేస్తారు.
ఓటరు తన ఓటు వేసే ముందు… ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ లోని బ్యాలెట్ బటన్ నొక్కుతారు. ఆ తర్వాతే ఓటు హక్కు వినియోగించుకునే వీలు కలుగుతుంది.
బ్యాలెట్ యూనిట్ లో 15 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు నోటా బటన్ ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ మంది పోటీ చేస్తే మరో బ్యాలెట్ యూనిట్ ను వాడతారు. అలా ఒక ఈవీఎంకు 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించవచ్చు.
బ్యాలెట్ యూనిట్ పై ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా నొక్కగానే రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది.
మనం ఎవరికైతే ఓటు వేయాలనుకున్నామో ఆ క్యాండిడేట్ సీరియల్ నంబర్, పేరు, గుర్తు చూపించే పేపర్ స్లిప్.. వీవీప్యాట్ విండో ద్వారా ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.
తర్వాత డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. ఆ వెంటనే బీప్ సౌండ్ వినిపిస్తుంది. అలా జరిగితేనే ఓటు నమోదైనట్టు లెక్క.
ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 2 వేల ఓట్లను రికార్డు చేయొచ్చు. కానీ ఎలక్షన్లలో పదిహేను వందల ఓట్లను మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎలక్షన్ పూర్తైన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు.
కౌంటింగ్ రోజున అభ్యర్థులు, ఎన్నికల అధికారుల సమక్షంలో వాటిని తెరుస్తారు. క్యాండిడేట్లు, కౌంటింగ్ ఏజెంట్ల ముందు ఓట్లను లెక్కిస్తారు.
కంట్రోల్ యూనిట్ లోని టోటల్ బటన్ ఇందుకు ఉపయోగపడుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ లు బయటకు తీసి వాటిని బ్లాక్ కవర్ లో భద్రపరుస్తారు.
ఇంకోవిషయం ఏంటంటే.. ఈవీఎంలకు కరెంట్ సరఫరా అవసరం లేదు. బ్యాటరీతో ఇవి పని చేస్తాయి. పోర్టబుల్ గా ఉండే వీటిని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు తరలించడం చాలా ఈజీ. పారదర్శకతతో పాటు సమర్థవంతంగా ఎన్నికలు జరిగేందుకు ఈవీఎంలు ఉపయోగపడతాయి. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వీటిని ఉపయోగిస్తోంది.
- పి. వంశీకృష్ణ