ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపుతున్నాడు. ఈ పరిస్థితుల్లో మండు వేసవి నుంచి రిలీఫ్ పొందేందుకు కూల్ గా ఉండే ఏదైనా ప్లేస్ కు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు (E-passes Mandatory To Visit Ooty, Kodaikanal).
అలాంటి ప్రాంతాలనగానే మన దేశంలో ముందుగా గుర్తొచ్చేవి ఊటీ, కొడైకెనాల్. ఇవి రెండూ తమిళనాడులోనే ఉన్నాయి. (E-passes Mandatory To Visit Ooty, Kodaikanal)
నీలగిరి పర్వతాలపై ఉన్న ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ ఊటీ. దీన్నే ఉదకమండలం అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే అతి శీతల వాతావరణం నమోదవుతుంది. కాఫీ తోటలు, జింకల పార్కు, ఊటీ సరస్సు, బొటానికల్ గార్డెన్.. ఇలాంటివెన్నో ఊటీలో చూడదగిన ప్రదేశాలు.
ఇక రెండో ప్రదేశం కొడైకెనాల్. ఊటీకి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. దిండిగల్ జిల్లాలో ఉండే కొడైకెనాల్.. భూమికి 2,225 అడుగుల ఎత్తులో ఉంది. కొడైకెనాల్ ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ గా పిలుస్తారు. అతి సుందరమైన జలపాతాలు, కృత్రిమ సరస్సు, ఆకట్టుకునే ఉద్యానవనాలు ఇక్కడి ప్రత్యేకతలు.
ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఊటీ, కొడైకెనాల్ కు వేసవిలో పర్యాటకులు పోటెత్తుతారు. సమ్మర్ లో ఆ ప్రాంతాలు రద్దీగా మారతాయి.
దీంతో, పర్యాటకులందరికీ అక్కడ మౌలిక వసతులు దొరకడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మద్రాసు హై కోర్టు కీలక సూచనలు చేసింది. టూరిస్టులకు ఈ-పాస్ ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. న్యాయస్థానం సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ-పాస్ లను జారీ చేస్తోంది.
ఈ-పాస్ లు ఎవరు తీసుకోవాలి?
సొంత వాహనాల్లో ఊటీ, కొడైకెనాల్ తో పాటు నీలగిరి కొండలపైకి వెళ్లే టూరిస్టులు.. ఈ-పాస్ లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ వెబ్ సైట్ epass.tnega.org లో టూరిస్టులు వారి వివరాలు నమోదు చేసుకుని ఈ-పాస్ లు పొందవచ్చు. ఎంత మంది అక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ బస చేస్తారు? ఎన్ని రోజులుంటారు? ఏ వాహనంలో వెళ్తున్నారు? ఇలాంటి వివరాలన్నీ వెల్లడించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక క్యూఆర్ కోడ్ తో ఈ-పాస్ జారీ అవుతుంది. హిల్ స్టేషన్లలో ఎంట్రీ పాయింట్ల దగ్గర స్కాన్ చేసినప్పుడు టూరిస్టుల వివరాలన్నీ తెలుస్తాయి.
వేసవిలో ఊటీ, కొడైకెనాల్ కు జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారికి సరిపడా మౌలిక వసతులు కల్పించేందుకు ఈ-పాస్ విధానం దోహదపడుతుంది.
ఏ రోజున ఎంత మంది వచ్చారు? ఎన్ని రోజులుంటారు? ఎన్ని వాహనాలు వస్తున్నాయి? ఇలాంటి వివరాలన్నీ ముందే తెలుస్తాయి. దీనివల్ల పర్యాటకులకు అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు చేపట్టే వీలు కలుగుతుంది.
- పి.వంశీకృష్ణ