రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ … ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం తర్వాత ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో మొదటి సారిగా ప్రసంగించారు. ప్రస్తుతం మన దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటోందని … ఇలాంటి సమయంలో తాను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. దేశ ప్రజల విశ్వాసానికి తన ఎన్నిక ప్రతీక అని అన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు సూచించిన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ముర్ము … రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అక్కడి నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి, సి.జె.ఐ తదితరులు ముర్మును ఘనంగా స్వాగతించారు. అనంతరం … రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసిన ముర్ము … ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టిన తొలి గిరిజన నేతగా, రెండవ మహిళగా ముర్ము చరిత్ర సృష్టించారు.
ALSO READ: శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత