ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించాయి. అనంతరం కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ 9 వరకు ఇది కొనసాగుతుంది.
కాగా, రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పలు విషయాలను ప్రస్తావించింది. కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తని.. బయటకొస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే చాన్స్ ఉందని తెలిపింది. దీనివల్ల దర్యాప్తునకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పింది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని… అందులో కవిత పాత్రపై ఇంకాలోతైన విచారణ జరపాల్సి ఉందని తెలిపింది. అటు, తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత కోరారు. చివరకు ఈడీ వాదనలతో కోర్టు ఏఖీభవించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కవితను తీహార్ జైలుకు తరలించారు. వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు ఆమె అక్కడే ఉండనున్నారు. కాగా, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఏప్రిల్ 1న దీనిపై విచారణ చేపట్టనున్నారు.
కడిగిన ముత్యంలా బయటకొస్తా:
కడిగిన ముత్యంలా తాను బయటకొస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసని విమర్శించారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. మూడో నిందితుడు 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ఆ పార్టీకి ఇచ్చాడని తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని.. అప్రూవర్ గా మారబోనని.. క్లీన్ గా బయటకొస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు.
- పి.వంశీకృష్ణ