ఈరోజు Chiranjeevi Eye and Blood Centre లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు 52 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను మరియు వ్యాన్‌ను అందజేశారు.
1998 అక్టోబర్‌లో సినీ నటుడు శ్రీ చిరంజీవి ప్రారంభించిన ట్రస్ట్ రక్తదానం మరియు నేత్రదానం అనే రెండు లక్ష్యాలపై పనిచేస్తోంది.
ఇప్పటి వరకు ఈట్రస్టు పది లక్షలకు పైగా రక్త యూనిట్లను, పదివేలకు పైగా కంటి కార్నియాను సేకరించి పంపిణీ చేసింది.
సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను గుర్తించిన LIC, వారికి నిత్యమూ ఉపయోగపడే వైద్య పరికరాలు మరియు వ్యాన్‌తో సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు అందించిన పరికరాలు దాతల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే, దాతల నుండి సేకరించిన రక్తాన్ని విశ్లేషించి, వేగంగా వినియోగదారులకు సిద్ధంగా ఉంచగలుగుతారు.
2006 లో స్థాపింపబడిన LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన లక్ష్యంతో పనిచేస్తోందని శ్రీ పునీత్ కుమార్ తెలిపారు.
విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆరోగ్య విభాగం లో సేవలందిస్తున్న hospitals మరియు ఇతర సంస్థలు, సేవాభావంతో విద్యను ప్రోత్సహిస్తున్న సంస్థలకి LIC Golden Jubilee Foundation ద్వారా తోడ్పడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 900 సంస్థలకు, ఈ కార్యక్రమాలకై సహకరించామన్నారు.
Chiranjeevi Eye & Blood Centre CMO అయిన డాక్టర్ మాధవిరాజు గారు పరికరాలను స్వీకరించారు. ట్రస్ట్ కార్యకలాపాలకు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చినందుకు ఎల్ఐసికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్‌కు ఎంతో ఉపయోగకరమైన వైద్య పరికరాలను అందించిన మొదటి ప్రభుత్వ సంస్థ ఎల్ఐసి అని ఆమె తెలియజేసారు. సమాజ హితం కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఇది ప్రేరణ అని ఆమె అన్నారు. త్వరలో మరిన్ని సేవలను ట్రస్ట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.
LIC ఉన్నతాధికారులు శ్రీ ఉతుప్ జోసెఫ్, శ్రీ రామయ్య, శ్రీ ప్రమోద కుమార్ సాహూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









