ఇండియన్ మార్కెట్ లో Initial Public Offering – IPOల హవా నడుస్తోంది..! పబ్లిక్ ఇష్యూకు అనుకూల వాతావరణం ఉండటంతో కంపెనీలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి..! 2024లో ఇప్పటికే ఐదు కంపెనీలు ఐపీవోల ద్వారా 3 వేల 2 వందల కోట్లకు పైగా సమీకరించిన సంగతి తెలిసిందే కదా. వాటి బాటలోనే మరో 3 సంస్థలు పయనిస్తున్నాయి. 1700 కోట్లు సేకరించడమే లక్ష్యంగా IPOతో ముందుకొచ్చాయి.
పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైన వాటిలో Rashi Peripherals, Capital Small Finance Bank, Jana Small Finance Bank ఉన్నాయి. ఐపీవో సబ్ స్క్రిప్షన్ ఫిబ్రవరి 7న మొదలై 9వ తేదీన ముగుస్తుంది. ఇక ఒక్కో కంపెనీ వివరాలు పరిశీలిస్తే..
-
Rashi Peripherals:
1989లో ఇది ప్రారంభమైంది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఉత్పత్తుల పంపిణీదారుగా కొనసాగుతోంది. భారత్ లో గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్ డిస్ట్రిబ్యూటర్ గా సేవలందిస్తోంది. ప్రీ-సేల్స్, టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్, క్రెడిట్ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా, ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సేకరించాలని Rashi Peripherals లక్ష్యంగా పెట్టుకుంది. 1.93 కోట్ల ఫ్రెష్ షేర్ల జారీ చేసి ఈ మొత్తాన్ని సమీకరించనుంది. షేర్ల ధర రూ. 295 నుంచి రూ. 311 వరకు ఉండనుంది. మినిమం లాట్ సైజ్ 48 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 14న ఐపీలో లిస్టవనుంది.
-
Capital Small Finance Bank Limited
1999లో దీన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్ లోని జలంధర్ లో ప్రధాన కేంద్రం ఉంది. ఆ రాష్ట్రంతో పాటు హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ లోనూ సేవలందిస్తోంది. సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో దీనికి మంచి పట్టుంది..! పబ్లిక్ ఇష్యూ ద్వారా 523 కోట్లు కలెక్ట్ చేయాలని Capital Small Finance Bank భావిస్తోంది. షేర్ల ధరల శ్రేణి రూ. 445 నుంచి రూ. 468గా ఉంది. ఒక్కో అప్లికేషన్ లో మినిమం లాట్ సైజ్ 32 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది.
-
Jana Small Finance Bank
ఈ బ్యాంకు 2006లో మొదలైంది. MSME లోన్లు, గృహ రుణాలతో పాటు NBFC, టూ వీలర్, గోల్డ్, అగ్రికల్చర్, గ్రూప్ లోన్స్ ను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఐపీవోతో 570 కోట్లు రాబట్టాలని యోచిస్తోంది. ఇందులో 462 కోట్లు తాజా షేర్ల ద్వారా.. 108 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సేకరించనుంది. షేర్ల ధరల శ్రేణి రూ. 393 నుంచి రూ. 414 వరకు ఉంది. భవిష్యత్ అవసరాల కోసం ఐపీవో ద్వారా సమీకరించిన మొత్తాన్ని Jana Small Finance Bank వినియోగించనుంది.
గత రెండేళ్లుగా నిధులు సమీకరించడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అలా 2023లో 58 సంస్థలు 52 వేల కోట్లకు పైగా నిధులు కలెక్ట్ చేశాయి. 2022లో 40 కంపెనీలు 59 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే చాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
- పి. వంశీకృష్ణ