జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
సికింద్రాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బిఆర్ కె ఆర్ భవన్ లోని సి.ఎస్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ రామ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, సి.ఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమీషనర్ డీ.ఎస్. చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమేయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పలు ప్రతిపాదనలు, సూచనలు చేశారు.హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలలో అన్ని భారీ/ ఎత్తైన భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి.
వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి.ఫైర్ సెఫ్టి పేరుతొ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి.అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలి.
హైదరాబాద్ నగరంలో వస్తున్న భారీ అంతస్తుల భవన నిర్మాణాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలి.ఈ మేరకు పాశ్చాత్య దేశాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతుల పైన అధ్యయనాన్ని వేగంగా చేపట్టి సూచనలు ఇవ్వాలని మంత్రుల ఆదేశం
ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ శాఖ సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైన ఆధునిక సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సామాగ్రి విషయానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన
అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచన.ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన అగ్నీ ప్రమాదంలో మరణించిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా అందించాలి.