లాల్ దర్వాజ బోనాలకు సర్వం సిద్ధం
భాగ్యనగరంలో ఆషాఢ బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మరో ప్రఖ్యాత ప్రాంతమైన లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి గుడిలో రేపు, ఎల్లుండి బోనాల జాతరను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు.
పాతబస్తీ ప్రాంతంలో జరిగే లాల్ దర్వాజ బోనాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రతి ఏటా ఇక్కడ బోనాల జాతరను అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే కోవిడ్ కారణంగా రెండేళ్ళ పాటు ఆ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సారి మాత్రం ధూంధాంగా జరిపేందుకు సిద్ధమయ్యారు.
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వేకువజాము నుంచే క్యూ లైన్లలో నిలబడి ఆ తల్లిని దర్శించుకుంటారు. చల్లగా కాపాడమని వేడుకుంటారు.
ఈ సారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బోనం ఎత్తుకునే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.
బోనాల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. చార్మినార్, మీర్ చౌక్, ఫలక్ నుమా, బహదూర్ పురా ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. మదీనా ఏరియాలో ప్రధాన రహదారిపై రాకపోకలకు అనుమతి ఉండదు. సోమవారం రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ప్రజలు బోనాల జాతరకు సహకరించాలని కోరారు.
ALSO READ: శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత