5వ రౌండ్ లోనూ రిషి సునాక్ విజయం
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుని ఎన్నిక ప్రక్రియలో తొలి నాలుగు రౌండ్లలో ఆధిపత్యాన్ని కనబర్చిన ఆయన … 5వ రౌండ్ లోనూ సత్తా చాటారు. భారీ మెజార్టీతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఓటింగ్ లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 137 మంది ఎంపీలు సునాక్ కు ఓటు వేశారు. ఆయనతో పాటు బరిలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ కు 113 ఓట్లు దక్కాయి. మరో అభ్యర్థి పెన్నీ మోర్డాంట్ కు 105 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో, ఆయన ప్రధాని రేసు నుంచి వైదొలిగారు. ఇక.. రిషి, లిజ్ ట్రస్ మధ్యే తదుపరి పోరు జరగనుంది.
బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టేందుకు రిషి సునాక్ ఇప్పుడు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగనుంది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారే … బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం మొదటగా 5 రౌండ్ల ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ పోరులో చివరి వరకు మిగిలిన ఇద్దరు అభ్యర్థులు … పార్టీ సభ్యుల మద్దతు కోసం కొన్ని వారాల పాటు ప్రచారం చేయాల్సి ఉంటుంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ ఇద్దరూ ఇప్పుడు ఆ ప్రక్రియలో పాల్గొంటారు.
ఇదే కాకుండా బీబీసీలో వారిద్దరి మధ్యా లైవ్ డిబేట్ ఉంటుంది. అది పూర్తయిన అనంతరం కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దాదాపు 2 లక్షల మంది సభ్యులు … పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ నాయకుణ్ణి ఎన్నుకుంటారు. అందులో విజయం సాధించిన వ్యక్తే బ్రిటన్ నూతన ప్రధాని అవుతారు. ఈ ఫలితాలను సెప్టెంబర్ 5వ తేదీన ప్రకటిస్తారు.
తదుపరి ఘట్టంలో రిషి సునాక్ కు లిడ్ ట్రస్ కు మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకోవడం ఎంతో అవసరం. రిషితో పాటు లిడ్ ట్రస్ కు కూడా పార్టీలో పట్టు ఉండటంతో … ప్రధాని ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఈ పోటీలో రిషి గెలిస్తారా..? బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారా..? వేచి చూడాల్సిందే.