శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
త్రీవ ఆర్థిక సంక్షోభంలో చిక్కున్న శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే విజయం సాధించారు. ఆ దేశ 8వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ప్రతికూల పరిస్థితులు, నిరసనకారులు ఆందోళనల నేపథ్యంలో లంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స … ఆ దేశాన్ని వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన వెళ్తూ వెళ్తూ ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిని చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ప్రెసిడెంట్ కోసం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో రణిల్ తో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు. మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకే ఎన్నికల బరిలో దిగారు.
శ్రీలంక పార్లమెంట్ ఆవరణలో ఇవాళ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఇందులో 223 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాటిలో 4 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వారిలో 134 మంది ఎంపీలు రణిల్ విక్రమసింఘే కు ఓటు వేశారు. డల్లాస్ కు 82 ఓట్లు దక్కాయి. అనురా కేవలం 3 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధ్యక్ష పదవి చేపట్టడానికి 113 ఓట్లు అవసరం కాగా అంతకన్నా ఎక్కువ రణిల్ కు పడ్డాయి. దీంతో, ఆయన గెలుపొందినట్టు లంక పార్లమెంట్ ప్రకటించింది.
రణిల్ విక్రమసింఘే ఆరుసార్లు శ్రీలంక ప్రధానిగా సేవలను అందించారు. యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన ఆయన గతంలో ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబర్ వరకు రణిల్ ఆ పదవిలో కొనసాగుతారు.
ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. ధరలపై నియంత్రణ లేకపోవడం, ఇదివరకెన్నడూ చూడని ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ పరిస్థితులలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. గొటబయ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇలా వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో రణిల్ .. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. లంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి ఆయన ఎలా ముగింపు పలుకుతారు..? సవాళ్ళను ఏ విధంగా అధిగమిస్తారు..? వేచి చూడాలి.
ALSO READ: రేపే రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్