రేపే రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఈ ప్రక్రియ జరగనుంది. ఎన్నికల ఫలితాలను సాయంత్రం ప్రకటించనున్నారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తమ్మీద ఈ ఎలక్షన్ లో 98.90 శాతం ఓటింగ్ నమోదయింది.
ఈ ఎన్నికల్లో ఎన్.డి.ఎ తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పోటీ చేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో దిగారు. వీరిలో ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 44 పార్టీలు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చడమే అందుకు కారణం.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించారు. మిస్టర్ బ్యాలెట్ బాక్స్ పేరుతో వాటికి ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసి దేశ రాజధానికి పంపించారు. ఇదివరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో ఎన్నికల అధికారుల హ్యాండ్ బ్యాగేజీగా బ్యాలెట్ బాక్సులను పంపేవారు. కానీ ఈ సారి వాటికోసం విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం విశేషం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం కూడా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,43,231గా ఉంది. అందులో ఎన్.డి.ఎకు 49%, యూపీఏకు 24.02%, ఇతర పార్టీలకు 26.98% ఓట్లున్నాయి. పార్టీల మద్దతు, క్రాస్ ఓటింగ్ ని బట్టి చూస్తే ఇందులో 60 శాతానికి పైగా ఓట్లు ముర్ముకు దక్కుతాయని భావిస్తున్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. రేపు ఫలితాల ప్రకటన అనంతరం .. ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఉంటుంది.
ALSO READ: వర్క్ ఫ్రం హోమ్: ఉద్యోగులకు గుడ్ న్యూస్