క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? ఎలా సంభవిస్తుంది..?
Cloudburst: తెలంగాణతో పాటు దేశంలోని అనేక చోట్ల దాదాపు వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిశాయి. మన రాష్ట్రంలో గోదావరి నది పరీవాహక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గత కొన్ని దశబ్దాలుగా చూడని వరద ఈ సారి సంభవించింది. భద్రాచలం దగ్గర గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ కుండపోత వానలకు క్లౌడ్ బరస్ట్ కారణమని … దీని వెనుక విదేశీ కుట్ర దాగుందని సీఎం కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో, ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. క్లౌడ్ బరస్ట్ పై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. మేఘ విస్ఫోటం గురించి తెల్సుకునేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యలో క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? ఎప్పుడు సంభవిస్తుంది..? ఇది వరకు అలా ఎక్కడైనా జరిగిందా..?
భారత వాతావరణ శాఖ తెలిపినదాని ప్రకారం … అతి తక్కువ సమయంలో అత్యంత భారీ వర్షాలు పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అని చెప్తారు. అంటే 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో కేవలం గంట వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. పిడుగులు, ఉరుములతో కూడిన వానలు పడతాయి. కుంభవృష్టి కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవిస్తాయి. వీటిని ముందుగానే అంచనా వేయడం కష్టం. ఒకవేళ స్వల్ప విస్తీర్ణంలో గంట నుంచి 2 గంటల వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే … దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ రెండింటి వల్ల భారీ వర్షాలు పడి వరదలు వస్తాయి.
సాధారణంగా రుతుపవనాలు ప్రవేశించేటపుడు సముద్రం నుంచి తేమతో నిండిన గాలి వీస్తుంది. కొండలు, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఈ గాలి అత్యధిక తేమను కలిగి ఉంటుంది. వర్షం పడే పరిస్థితి ఉన్నపటికీ కొన్ని సార్లు అలా జరగదు. వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభస్తూనే ఉంటాయి. ఈ ప్రక్రియ అలాగే కొనసాగితే మేఘాల సాంద్రత పెరుగుతుంది. ఇదే క్లౌడ్ బరస్ట్ కు దారి తీస్తుంది. ఒక్కసారిగా ఈ మేఘాలు విస్ఫోటం చెందితే … ఆ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి.
క్లౌడ్ బరస్ట్ … ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఎత్తైన ప్రాంతాల్లో ఇలా జరిగే అవకాశాలు మాత్రం కొంచం ఎక్కువ. భారత్ లో ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మేఘ విస్ఫోటాలు తరచూ జరుగుతుంటాయి. మనదేశంలో 1970 నుంచి 2016 వరకు దాదాపు 30 సార్లు క్లౌడ్ బరస్ట్ అయింది. కేదార్ నాథ్ లో 2013లో వచ్చిన భయానక వరదలకు కూడా ఇదే కారణం. అమర్ నాథ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ అయింది. ఇలా గతంలో చాలాసార్లు మన దేశంలో ఈ పరిస్థితి చూశాం. వీటి వల్ల ధన, ప్రాణ నష్టం కూడా కలిగింది.
నిజానికి క్లౌడ్ బరస్ట్ అనేది సహజ సిద్ధమైన ప్రక్రియ. శాస్త్రవేత్తలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. అయితే గతంలో మేఘాలను కరిగించేందుకు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ఉపయోగించారు. అదే తరహాలో క్లౌడ్ బరస్ట్ కూడా చేయొచ్చనేది కొందరి వాదన. దీనిపై నిజానిజాలు తేలాల్సి ఉంది.
ALSO READ: President Election 2022: నేడు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్