Simhachalam: సింహాచలం గిరి ప్రదక్షిణ
Simhachalam: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి పూజలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అయితే ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. దాదాపు 32 కిలోమీటర్ల మేర పర్వత ప్రదక్షిణ కొనసాగనుంది.సింహాచలం నుంచి బీఆర్టీఎస్ మీదుగా హనుమంతవాక జంక్షన్, తేనేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్డు, ‘సీతమ్మధార, మాధవధార, ఎన్ ఏడీ, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు సింహాచలం చేరుకుంటారు. తొలుత పవంచ దగ్గర సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సింహగిరి సమీపంలోని గ్రామం భక్తులతో కిటకిటలాడింది.
మరోవైపు విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొండ మార్గం గుండా వాహనాలు వెళ్లకుండా నగర పోలీసులు బందోబస్తు చేపట్టారు. ప్రయాణికుల కోసం ఇతర మార్గాలను సూచిస్తున్నారు. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా సోమవారం రాత్రి నుంచి ఈ చర్యలు చేపట్టారు.రెండేళ్ల తర్వాత గిరిప్రదక్షిణకు అధికారులు అనుమతి ఇవ్వడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు ఉదయం వరకు కొనసాగనుంది. ఇందులో 2 వేల మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు.