తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్న తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఆసక్తిని రేపింది. దేశవ్యాప్తంగా కులగణనపై తీవ్రంగా చర్చ నడుస్తున్న తరుణంలో… కులగణన చేస్తే ఏం వస్తుందనే వారికి తాజా మంత్రి వర్గ విస్తరణే సమాధానం అంటూ… 2025 జూన్ 8న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేసినట్లు అధికార కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అయితే, ఈ విస్తరణలో ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్త మంత్రులుగా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్‌కు స్థానం దక్కింది. నీటిపారుదల, గనులు & జియాలజీ శాఖను గడ్డం వివేక్‌కు కేటాయించారు. ఎస్సీ (మాల) సామాజికిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా వివేక్‌కు… రాజకీయంగా ఆదిలాబాద్ జిల్లాలో బలమైన ప్రభావం ఉంది.
ఇక, బీజీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన, మహబూబ్ నగర్ నియోకవర్గం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రవాణా శాఖ దక్కింది. వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
అలాగే, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి వర్గంలో అవకాశం లభించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం…సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించినట్లు తెలిపింది. కాగా… ఈయనకు ఎక్సైజ్ & పర్యాటకం శాఖలు కేటాయించారు.
ఇక, ఈ ముగ్గురు మంత్రులు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో 2025 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా… సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే… ఈ ముగ్గురితో పాటు… అదనంగా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రనాయక్‌కు శాసనసభ ఉపసభాపతి పదవి కూడా కేటాయించారు.
2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖలు చూస్తే…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద మున్సిపల్, శాంతిభద్రతలతో పాటు ఎవ్వరికీ కేటాయించని శాఖలు ఉండగా…
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ, ఆర్థిక శాఖ..
ఉత్తమ్ కుమార్ రెడ్డి: హోం, నీటిపారుదల శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: పురపాలక శాఖ
దామోదర రాజనర్సింహ: ఆరోగ్య శాఖ
జూపల్లి కృష్ణారావు: పౌరసరఫరాల శాఖ
తుమ్మల నాగేశ్వర రావు: రోడ్లు, భవనాల శాఖ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు: ఐటీ, ఇండస్ట్రీస్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: నీటిపారుదల, లెజిస్లేటివ్ అఫైర్స్
కొండా సురేఖ: మహిళా, శిశు సంక్షేమ శాఖ
పొన్నం ప్రభాకర్: బీసీ సంక్షేమ శాఖ
సీతక్కకు: గిరిజన సంక్షేమ శాఖలు ఉన్నాయి.
ఇక, ఈ తాజా మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని ఆశావాహులు కూడా లేకపోలేదు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాశకు గురయ్యారు. వారిలో ప్రముఖంగా… నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి ఒకరు. సీఎం రేవంత్ రెడ్డి ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టినప్పటికీ, హైకమాండ్ నిర్ణయంతో ఈ అంశం ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే, మరో సీనియర్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండటం వల్ల ఇద్దరూ ఒకే కుటుంబం నుండి మంత్రులుగా ఉండటం సాధ్యం కాదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ జిల్లాల నుండి ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కావాలని ఒత్తిడి చేస్తున్నారు. సీనియర్ నేత జానారెడ్డి ఈ అంశంపై AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గతంలో ఈ జిల్లాలకు ఆరుగురు మంత్రులు ఉండేవని జానారెడ్డి AICC నేతలకు వివరించారు.
ఇకపోతే, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని ఒత్తిడి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, ప్రస్తుతం మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ సమయం తీసుకుంటుందని సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి ప్రాతినిధ్యం కోసం ఆశావాహులు ఒత్తిడి చేస్తున్న నేపధ్యంలో… మిగిలిన ఖాళీల భర్తీపై హైకమాండ్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.













