5జీ సేవలు:
5జీ నెట్ వర్క్ కోసం వేచిచూస్తున్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. వినియోగదారుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. 4జీ కన్నా ఎన్నో రెట్లు అధిక వేగంతో పనిచేసే 5జీ సేవలు … ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసిన నేపథ్యంలో ఆయన పలు కీలక అంశాలను తెలియజేశారు. ఈ నెల 10వ తేదీలోగా 5జీ కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.
వారం రోజులపాటు జరిగిన 5జీ వేలంలో రూ. 1,50,173 కోట్ల విలువైన బిడ్లను పలు కంపెనీలు దాఖలు చేశాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ వేలంలో పోటీ పడ్డాయి. వాటితో పాటుగా అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ తొలిసారిగా బరిలో దిగింది. ఈ ఏడాది 72 గిగా హెడ్జ్ (72098 మెగా హెడ్జ్) స్పెక్ట్రమ్ ను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో తక్కువ శ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరిధిలో 600, 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగా హెడ్జ్ ఉన్నాయి. మధ్య శ్రేణిలో 3300 మెగా హెడ్జ్, అధిక ఫ్రీక్వెన్సీలో 26 ఎం.జెడ్.హెచ్ ను వేలం వేశారు. దీని మొత్తం విలువ దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు. అందులో 51,236 మెగా హెడ్జ్ అమ్ముడైంది.
భారత్ లోని 22 సర్కిళ్ల పరిధిలో 5జీ స్పెక్ట్రమ్ కోసం జియో బిడ్లను వేసింది. వాటి విలువ రూ. 88,078 కోట్లు. తర్వాత స్థానంలో ఎయిర్ టెల్ నిలిచింది. 700 ఎం.హెచ్.జెడ్ మినహా మిగతా బ్యాండ్లలో 19,800 ఎం.హెచ్.జెడ్ కు పైగా స్పెక్ట్రమ్ ను దక్కించుకుంది. దాని విలువ రూ. 43,084 కోట్లు. ఇక, వొడాఫోన్ ఐడియా రూ. 18,799 కోట్ల విలువైన 6228 ఎం.హెచ్.జెడ్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. 26 గిగా హెడ్జ్ బ్యాండ్ లోని 400 ఎం.హెచ్.జెడ్ ను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఆ కంపెనీ తమ స్వంత అవసరాల కోసం దీన్ని వినియోగించుకోనుంది.
గత ఏడాది 4జీ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు రూ. 77,815 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ ను విక్రయించారు. 2010లో జరిగిన 3జీ ఆక్షన్ లో రూ. 50, 958 కోట్ల స్పెక్ట్రమ్ అమ్ముడైంది. ఈ సారి అంతకు మూడు రెట్లు (రూ. 1,50,173 కోట్లు) కేంద్రానికి సమకూరుతోంది.
మన దేశంలో ఫస్ట్ ఫేజ్ కింద 13 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గుర్ గావ్, కోల్ కతా, లక్నో, పుణె, చెన్నై లో ఈ సదుపాయాన్ని కల్పిస్తారు. వాటితో పాటుగా హైదరాబాద్, గాంధీనగర్, జామ్ నగర్, అహ్మదాబాద్, చండీగఢ్ లో 5జీ సేవలను వినియోగించుకోవచ్చు. రాబోయే రెండు, మూడు ఏళ్ళలో దేశ వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ను విస్తరించనున్నారు.