సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఐదెన్ మార్ క్రమ్ ఇప్పటివరకు సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ సారి అతణ్ని తప్పించిన యాజమాన్యం కమిన్స్ కు బాధ్యతలు కట్టబెట్టింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ .. ఆరెంజ్ ఆర్మీ నీకు స్వాగతం పలుకుతోంది అంటూ ట్వీట్ చేసింది.
గత రెండు సీజన్లలో సన్ రైజర్స్ టీం పర్ఫామెన్స్ దారుణంగా ఉంది. వార్నర్, విలియమ్సన్ వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన తర్వాత మార్ క్రమ్ కెప్టెన్ అయ్యాడు. అయినప్పటికీ మార్పు రాలేదు. పోయిన సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో… తర్వాత జరిగిన మినీ ఆక్షన్ లో కమిన్స్ ను 20.5 కోట్లకు ఆ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
ఈ సారైనా గెలుస్తుందా?:
SRHకు 2022లో కేన్ విలియమ్సన్, 2023లో మార్ క్రమ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇప్పుడు మరో కొత్త నాయకుడితో బరిలోకి దిగబోతోంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ 17 మొదలుకానుంది. 23న హైదరాబాద్ జట్టు కోల్ కతాతో తలపడుతుంది. అటు, ప్రస్తుత సీజన్ లో కోచింగ్ స్టాఫ్ ను కూడా SRH మార్చేసింది. బ్రియాన్ లారాను మార్చి హెడ్ కోచ్ బాధ్యతలను డేనియల్ వెటోరీకి అప్పగించింది. జేమ్స్ ఫ్రాంక్లిన్ ను బౌలింగ్ కోచ్ గా అపాయింట్ చేసింది.
సన్ రైజర్స్ జట్టు ఇదే:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మార్ క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, క్లాసెస్, అన్ మోల్ ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్, ఉపేంద్ర యాదవ్, జాన్ సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ట్రావిస్ హెడ్, హసరంగ, ఉనత్కద్, ఆకాశ్ సింగ్
కెప్టెన్సీతో పాటు ఈ సారి కీలక మార్పులెన్నో చేసింది SRH. గెలుపుపై గంపెడాశలు పెట్టుకుంది. కమిన్స్ కెప్టెన్సీలో అయినా విజయం వరిస్తుందనే ఆశతో ఉంది. ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లు కూడా జట్టులో చేరారు. మరి ఈ సీజన్ లో అయినా సన్ రైజర్స్ విజేతగా నిలుస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
- పి. వంశీకృష్ణ