పెరుగుతున్న బియ్యం రేట్ల నుంచి ప్రజలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్కువ ధరకే నాణ్యమైన రైస్ ను పంపిణీ చేయాలని సంకల్పించింది. దీనిలో భాగంగా భారత్ రైస్ పేరుతో విక్రయాలు ప్రారంభించింది. ఈ బియ్యం ధర కేజీ 29 రూపాయలు మాత్రమే..! ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్ రైస్ అమ్మకాలను ప్రారంభించారు.
బియ్యం రేట్లకు రోజురోజుకూ రెక్కలొస్తున్నాయి. తక్కువలో తక్కువ కిలో 50 రూపాయల వరకు ఉంది. నాణ్యమైన సోనా మసూరీ రైస్ కు 60 రూపాయల వరకు ధర పలుకుతోంది. అంత చెల్లించి బియ్యం కొనలేక పేద, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారికి భారత్ రైస్ మేలు చేయనుంది. 29 రూపాయలకే నాణ్యమైన బియ్యం ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండనుంది.
భారత్ రైస్ ఇప్పటికిప్పుడు షాపుల్లో దొరక్కపోవచ్చు. ప్రస్తుతానికి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశముంది. Food Corporation of India, National Agricultural Cooperative Marketing Federation of India , National Cooperative Consumers Federation ద్వారా భారత్ రైస్ ను అమ్ముతున్నారు. ఎవరికైనా ఈ బియ్యం కావాలంటే www.nafedbazaar.com ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది 5, 10 కేజీ బ్యాగుల్లో లభ్యమవనుంది.
సామాన్యులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అదించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకుగానూ భారత్ బ్రాండ్ కింద గోధుమ పిండి, శనగపప్పు, టమాటాలు, ఆనియన్ విక్రయాలను మొదలుపెట్టింది. గత ఏడాది భారత్ ఆటాను తీసుకొచ్చింది. బయటి మార్కెట్ లో ఈ పిండి కేజీ 35 రూపాయలు ఉండగా సర్కారు 27.50 రూపాయలకే అందిస్తోంది. శనగపప్పు 60 రూపాయలకు కేజీ చొప్పున అందుబాటులో ఉంచింది. nafedbazaar.com ద్వారా వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు భారత్ రైస్ కూడా వీటి సరసన చేరనుంది. దీని విక్రయాలు కూడా ఆశాజనకంగానే ఉంటాయని కేంద్రం భావిస్తోంది.
- పి. వంశీకృష్ణ