బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్.కె అద్వానీని కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. బీహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్ కు కూడా ఇటీవలే భారతరత్నను ప్రకటించింది. దీంతో, 2024లో ఇద్దరిని ఈ పురస్కారం వరించింది. మరింతకీ భారతరత్నకు అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? వారికి ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఇప్పటివరకు ఎంతమందికి ఇది దక్కింది? ఇలాంటి ఆసక్తికర విషయాలు మీ కోసం.
ఎవరు అర్హులు?
భారతరత్న..! మన దేశ అత్యున్నత పౌర పురస్కారం..! కళలు, సమాజసేవ, సాహిత్య, సాంస్కృతిక, విద్య, విజ్ఞాన, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో అద్భుత సేవలు అందించిన విశిష్ట వ్యక్తులకు భారతరత్న ప్రదానం చేస్తారు. 1954లో మొట్టమొదటిసారిగా ఈ పురస్కారాన్ని అందజేశారు. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త సీవీ రామన్ కు.. ఆ ఏడాది భారతరత్న ప్రకటించారు. ఆ తర్వాత 1966 నుంచి కొన్ని సవరణలు చేశారు. వాటి ప్రకారం మరణానంతరం కూడా భారతరత్న ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 1954 నుంచి ఇప్పటి వరకు 50 మందికి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. ఇక 1956, 59, 60, 64, 65, 67, 1968-70, 1972-74, 1977-79, 1981, 82, 1984-86, 1993-96, 2000, 2002-08, 2010-13, 2020-23 మధ్య కాలంలో భారతరత్నను ఎవరికీ అందజేయలేదు.
-
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
భారతరత్నకు అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డులకన్నా భిన్నంగా ఉంటుంది. ఆ వ్యక్తుల పేర్లను ప్రధాన మంత్రి సిఫార్సు చేస్తారు. వాటిని రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, చేసే వృత్తి, లింగ భేదం లేకుండా ఎవరి పేరునైనా భారతరత్న కోసం పరిశీలించే అవకాశముంది. ఒక సంవత్సరంలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే దీన్ని ప్రదానం చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ వీలుండదు. అయితే ఒక ఏడాదిలో కనీసం ఒక్కరికైనా భారతరత్న ఇవ్వాలనే నిబంధన మాత్రం లేదు. ఇక, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి కూడా ఈ అవార్డును ఇవ్వాలని 2011లో నిర్ణయించారు. దీంతో, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు 2014లో భారతరత్న అందజేశారు.
-
మెడల్ తో పాటు ఇంకేం ఉంటాయంటే..!
భారతరత్న గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రంతో పాటు మెడల్ ఇస్తారు. రావి ఆకు రూపంలో అది ఉంటుంది. ఒకవైపు సూర్యుడి బొమ్మ, దేవనాగరి లిపిలో భారతరత్న అని రాస్తారు. మరోవైపు జాతీయ చిహ్నం, కింద సత్యమేవ జయతే అనే అక్షరాలుంటాయి. పురస్కారం పొందిన వారికి కేంద్రం కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. రైల్వేలో వాళ్లు ఉచిత ప్రయాణం చేయొచ్చు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం కూడా అందుతుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాని తర్వాత వారికి ఏడో స్థాయి గౌరవం దక్కుతుంది. అయితే భారతరత్న స్వీకరించిన వాళ్లు తమ పేర్ల ముందు అవార్డు పేరు పెట్టుకునే వీల్లేదు. లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్స్ లో మాత్రం పురస్కారాన్ని అందుకున్నట్టు రాసుకోవచ్చు.
- పి. వంశీకృష్ణ