pm surya ghar

సౌరశ‌క్తి వినియోగంలో మ‌రో ముంద‌డుగు ప‌డింది. సోలార్ ప‌వ‌ర్ వాడ‌కాన్ని మ‌రింత పెంచ‌డంపై దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశ‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో భాగంగా పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కోటి ఇళ్ల‌కు 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందించ‌డ‌మే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. రూ. 75,021 కోట్ల‌తో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు.

రూఫ్ టాప్ సోలార్ స్కీంను కేంద్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కిలో వాట్ ప‌వ‌ర్ జ‌న‌రేట్ చేసే సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం రూ. 30 వేల స‌బ్సిడీని అందిస్తుంది. రెండు కిలో వాట్ ప్యానెళ్ల‌కు రూ. 60 వేలు, మూడు లేదా అంత‌క‌న్నా ఎక్కువ కిలో వాట్ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు రూ. 78 వేల రాయితీ ద‌క్కుతుంది. ఇందుకోసం నేష‌న‌ల్ పోర్ట‌ల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కంపెనీని కూడా అందులో నుంచే సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ పోగా మిగిలిన మొత్తాన్ని త‌క్కువ వ‌డ్డీకే రుణం ద్వారా పొందే అవ‌కాశం కూడా ఉంది.

ప్ర‌తీ జిల్లాలో ఒక‌ మోడ‌ల్ సోలార్ విలేజ్:

సోలార్ ప‌వ‌ర్ పై గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచ‌డంపై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే ప్ర‌తీ జిల్లాలో ఒక మోడ‌ల్ సోలార్ విలేజ్ ను అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పించింది. అంతేకాకుండా సూర్య ఘ‌ర్ ప‌థ‌కానికి ప్ర‌చారం క‌ల్పించే స్థానిక‌, ప‌ట్ట‌ణ‌, పంచాయ‌త్ రాజ్ సంస్థ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు కూడా అంద‌జేయ‌నుంది. వీటితో పాటుగా 2025 నాటికి అన్ని కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌పై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.

Poultary

డిస్క‌మ్ ల‌కు విద్యుత్ విక్ర‌యించొచ్చు:

3 కిలో వాట్ సోలార్ సిస్ట‌మ్ నెల‌కు 300 యూనిట్ల‌క‌న్నా ఎక్కువ విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తుంది. అందులో 300 యూనిట్ల‌ను ఫ్రీగా ఉప‌యోగించుకుని మిగతాది డిస్క‌మ్ ల‌కు విక్ర‌యించే అవ‌కాశం కూడా ఉంది. పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కానికి సంబంధించి అప్లై చేసుకునేందుకు, ఇత‌ర వివ‌రాల కోసం https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ లో సంప్ర‌దించ‌వ‌చ్చు. ఈ స్కీం ద్వారా కొత్త‌గా 17 ల‌క్ష‌ల ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement