పరమాత్ముని సందేశము పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ కె.ఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బుక్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, విజనరీ ప్రదీప్ ముఖర్జీ రాసిన మెసేజ్ ఫ్రమ్ గాడ్ పుస్తకానికి.. పరమాత్ముని సందేశము తెలుగు అనువాదం. డాక్టర్ సత్యవతి ఈ పుస్తకాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు.
ఇది చాలా ఆశ్చర్యకరమైన, ఆలోచించదగిన పుస్తకమని డాక్టర్ కె.ఐ వరప్రసాద్ రెడ్డి చెప్పారు. ఇలాంటి గొప్ప పుస్తకాన్ని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ బుక్ లో ప్రతి పదం, వాక్యం తరిచి తరిచి చదవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మన జీవన విధానంలో భాగమైన అనేక నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించి ఇదొక సలహా లేదా హెచ్చరికగా నిలుస్తుందని తెలిపారు. దీన్ని చదివిన కొందరికి.. వాళ్ళు ఇప్పటివరకు ఏర్పర్చుకున్న బంధాల నుంచి, నమ్మకాల నుంచి స్వేచ్ఛ లభించే అవకాశముందని.. అలాగే ఆలోచించలేనివాళ్లకి అయోమయం కలిగే అవకాశముందని చెప్పారు. “అనేక నమ్మకాలు, భరోసాలతో మన జీవన విధానం సాగుతుంది. మనలో అందరికీ ఒకేరకమైన విశ్వాసాలు, నమ్మకాలు లేకపోవచ్చు. ఎవరికి వాళ్ళు వారి వారి విశ్వాసాలు, ఆచారాలతో జీవిస్తున్నారు. మన పెద్దలు, కుటుంబ సభ్యులు, గురువులు, ప్రాచీన గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా అవన్నీ మనకు సంక్రమించాయి. విశ్వాసాలు, నమ్మకాలు ఒక రోజులో వచ్చినవి కావు.. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినవి” అని డాక్టర్ కె.ఐ వరప్రసాద్ రెడ్డి వివరించారు. జీవితం సుగమంగా మారడానికి ఈ పుస్తకం మరో మార్గంగా గోచరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇందులో సూచించిన విధంగా 30 రోజులపాటు పాటిస్తే.. పరమాత్మను చేరుకునే విధానం తెలుస్తుందని చెప్పారు. పుస్తకాన్ని చదివి దేవునితో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ఆధ్యాత్మికతపై మరింత లోతైన దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పరివర్తన మెరుగుపడేందుకు అవసరమైన వినూత్న విధానాన్ని పరిచయం చేస్తుంది. 30 రోజుల్లో పాఠకుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు కలిగేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే దేవునితో మధ్యవర్తిత్వం లేని సంబంధాన్ని నెలకొల్పేందుకు మార్గాన్ని చూపిస్తుంది. విశ్వాసం, భక్తి లేదా ఏ సంస్థతోనూ అనుబంధం లేకుండానే దైవానుగ్రహాన్ని పొందేలా ప్రేరణ ఇస్తుంది. మతపరమైన సిద్ధాంతం, జనన మరణ చక్రం నుంచి ఆత్మలను విముక్తి చేసే లక్ష్యాలను తెలియజేస్తుంది.
వ్యక్తుల బాధలను పరిష్కరించేందుకు ఉపయోగపడే హీలింగ్ కార్డ్స్ కూడా పరమాత్ముని సందేశము పుస్తకంలో ఉన్నాయి. వారి జీవితంలో సానుకూల మార్పులకు ఇవి దోహదపడతాయి. అలాంటి గొప్ప పుస్తకాన్ని పాఠకుల కోసం ప్రదీప్ ముఖర్జీ అందించారు. ఆధ్మాత్మిక రచయితగా, విజనరీగా ఆయన ఎంతో పేరు పొందారు. మానవత్వం, దైవం మధ్య అంతరాన్ని తగ్గించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రదీప్ ముఖర్జీ..! పరమాత్ముని సందేశము పుస్తకం ద్వారా ఆయన మరెన్నో విలువైన విషయాలను ప్రపంచానికి తెలియజేశారు.